TPCC: ప్రజల్లోకి ఆరు గ్యారంటీలు
ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతలు.... కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్న హస్తం నాయకులు...;
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడి కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హస్తం పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి CWC సమావేశాల కోసం హైదరాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్ నేతలు..6 గ్యారంటీలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. తెలంగాణలో KCR, దేశంలో మోదీ, షాలు అధికారాన్ని తమ చేతుల్లో పెట్టుకుని పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. తుక్కుగూడలో జరిగిన విజయభేరీ సభలో కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా ఆ పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలు చేపట్టింది. CWC సమావేశాల కోసం దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ చేరుకోగా సోనియా సభ అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. అధిష్ఠానం కేటాయించిన ప్రాంతాలకు వెళ్లిన PCC అధ్యక్షులు, CLP నేతలు, ఇతర నాయకులు రాత్రి అక్కడే బసచేశారు. ఉదయం నుంచి స్థానిక నాయకులతో కలిసి గ్రామాలు, పట్టణాల్లో పర్యటిస్తూ ప్రజలను కలిశారు. ఇంటింటికి వెళ్లి, ఆరు గ్యారంటీల ప్రకటన, అమలు గురించి వివరించారు.
మల్కాజిగిరిలో తమిళనాడు PCC అధ్యక్షుడు అళగిరిగడపగడపకు తిరుగుతూ 6 గ్యారంటీలను ప్రజలకు వివరించారు. హైదరాబాద్ కింగ్ కోఠీలో మహారాష్ట్ర కాంగ్రెస్ నేత ఎక్నాథ్ గైక్వాడ్, హైదరాబాద్ మీర్‌పేట్‌లో AICC ఇన్‌ఛార్జ్ దీపా దాస్‌మున్షి పర్యటిస్తూ కర్ణాటక తరాహాలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని తెలిపారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టేందుకు ఎదురు చూస్తున్నారని రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని యూసుఫ్‌బాబా దర్గా నుంచి హనుమాన్ మందిర్ వరకు ఇంటింటికి ఆరు గ్యారంటీలు పేరుతో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గ నేత ఫిరోజ్‌ఖాన్‌తో కలిసి, నాంపల్లి యూసుఫ్ బాబా దర్గాలో ప్రార్థనలు నిర్వహించిన పైలెట్ ఇంటింటికి వెళ్లి, కాంగ్రెస్ అమలుచేయబోయే సంక్షేమ పథకాలను వివరించారు.
హనుమకొండలో CWC సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్, ఛండీగఢ్ PCC అధ్యక్షుడు హర్‌మోహిందర్ సింగ్ లక్కీ, AICC కార్యదర్శి రోహిత్ చౌదరి పర్యటించారు. ఖమ్మంలో కాంగ్రెస్ నేత అవినాష్ పాండే, VH ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాల గురించి తెలియజెప్పారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలం నాగులవంచలో CLP నేత భట్టి విక్రమార్క, మహబూబాబాద్‌లో అసోం PCC అధ్యక్షుడు భూపెన్ కుమార్, సత్తుపల్లి నియోజకవర్గంలో Md. ఆరీఫ్ నసీం ఖాన్ పర్యటిస్తూ... 6 గ్యారంటీలను వివరించారు. నల్గొండ జిల్లా హాలియాలో కుందూరి జైవీర్ రెడ్డితో కలిసి అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నబంటుకీ పర్యటించారు. నల్గొండలో పర్యటించిన CWC సభ్యుడు లాల్ జీ దేశాయ్ KCR, మోదీ పాలనా తీరుపై విమర్శలు గుప్పించారు. సిద్దిపేటలో పంజాబ్ PCC అధ్యక్షుడు అమరేందర్ సింగ్ రాజా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.