కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంపై రాష్ట్రవ్యాప్తంగా నేడు నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం వద్ద ఇవాళ సాయంత్రం 4 గంటలకు నిరసన కార్యక్రమం చేపట్టనునట్లు ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ అనుబంధ సంఘాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపిన వివక్షను నిరసిస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా స్థానిక అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అనుబంధ సంఘాల నేతలు తదితరులు పాల్గొనాలని పేర్కొన్నారు. ప్రధాని, ఆర్థిక, ఇతర కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలన్నారు.