Revanth Reddy: రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ఏకతాటిపైకి కాంగ్రెస్‌ సీనియర్లు..?

Revanth Reddy: కొల్లాపూర్‌ సభలో పాదయాత్రపై ప్రకటన చేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి.

Update: 2022-03-15 10:00 GMT

Revanth Reddy (tv5news.in)

Revanth Reddy: రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పడానికి కాంగ్రెస్‌ సీనియర్లు ఏకతాటిపైకి వస్తున్నారా? కొందరు సీనియర్లు ప్రత్యేకంగా భేటీ అవడానికి కారణం ఏంటి? కొల్లాపూర్‌ సభ తరువాత తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుందా? నిన్న తార్నాకలోని మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో జరిగిన కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ ఇన్ని అనుమానాలకు తావిస్తోంది.

కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌ రెడ్డి నివాసంలో శ్రీధర్ బాబు, గీతారెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, నిరంజన్, మరికొందరు నేతలు సమావేశం అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఈ నేతలంతా చర్చించారు. కొల్లాపూర్‌ సభలో పాదయాత్రపై ప్రకటన చేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి. త్వరలోనే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలు, 33 జిల్లాల్లో పాదయాత్ర చేస్తానని, ప్రజల కష్టాలను తెలుసుకుంటానని ప్రకటించారు.

దీనిపై రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాల్లో దుమారం రేగుతోంది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలపై అధిష్టానానికి మరోసారి ఫిర్యాదు చేయాలనే అభిప్రాయంలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం హోలీ తర్వాత ఢిల్లీకి వెళ్లి, తమ అభిప్రాయాలను అధిష్టానానికి చెప్పాలని నిర్ణయించారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పనితీరు పార్టీ ఐక్యతను దెబ్బతీసేలా ఉందని నేతలు అభిప్రాయపడ్డారు.

పార్టీ వ్యవహారాలు చూస్తున్న వాళ్లు పార్టీకి అనుబంధంగా ఉన్నారా లేదా అనేది చూడాలని హాట్‌ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా ప్రజల విశ్వాసం పొందుతుందనే దానిపై నిర్ణయాలు ఉండాలని చెప్పుకొచ్చారు. పార్టీలో సంస్థాగతమైన మార్పులు జరగాల్సి ఉందన్నారు.

పార్టీలో జరుగుతున్న పరిణామాలపైనే చర్చించాం అని కుండబద్దలు కొట్టారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్. సీనియర్ల విషయంలో జరుగుతున్న అవమానాలపై చర్చించామని, అధిష్టానం దృష్టికి అన్ని విషయాలను తీసుకెళ్తామని చెప్పుకొచ్చారు. అన్ని విషయాలు మీడియాకు చెప్పలేమన్నారు సంగారెడ్డి ఎమ్యెల్యే జగ్గారెడ్డి. వీహెచ్ చెప్పిన అంశాలన్నింటిపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రెట్టింపు బలం పొందడం కోసం ఏ విధంగా పని చేయాలనే దానిపై చర్చించామన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్‌ పార్టీతో కొన్ని సంవత్సరాలుగా అనుబంధం కొనసాగిస్తున్న నేతలుగా చర్చించుకున్నామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News