CONGRESS: ప్రచార జోరు పెంచిన కాంగ్రెస్‌

తుక్కుగూడ బహిరంగ సభకు ముమ్మర ఏర్పాట్లు... విజయవంతం చేసేలా ప్రణాళికలు...

Update: 2023-09-12 04:15 GMT

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రచార జోరు మరింత పెంచనుంది. ఇప్పటికే అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికను దాదాపుగా ఖరారు చేసిన టీపీసీసీ ఇక ప్రజల్లోకి మరింత దూసుకెళ్లేలా ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్‌ శివారు తుక్కుగూడలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మూడురోజులపాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించాలని పార్లమెంట్ నియోజక వర్గాల పరిశీలకులకు TPCC స్పష్టం చేసింది. ప్రతి పోలింగ్‌ కేంద్రం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని ముఖ్య పరిశీలకులకు సూచించింది.


హైదరాబాద్ వేదికగా 15,16, 17 తేదీల్లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాలను కాంగ్రెస్ నిర్వహిస్తోంది. ఈ సమావేశాలకు CWC సభ్యులు, అగ్ర నాయకులు సోనియా, రాహుల్, ప్రియాంక, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు,అన్ని రాష్ట్రాల PCC అధ్యక్షులు, CLP నేతలు వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోనియా గాంధీ చేతుల మీదుగా సికింద్రాబాద్ గాంధీ ఐడియాలజీ కేంద్రంలో భవన నిర్మానాలకు పునాది రాయి వేస్తారు. అనంతరం తుక్కుగూడ వద్ద నిర్వహించ తలపెట్టిన విజయభేరి సభలో ఐదు గ్యారంటీలను ఆమె ప్రకటిస్తారు.


తుక్కుగూడ విజయభేరి సభను ఖమ్మం తరహాలో విజయవంతం చేసేలా నేతలు ప్రణాళిక రచిస్తున్నారు. ఈ మేరకు గాంధీభవన్‌లో పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ముఖ్య నాయకులతో TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే సమావేశమయ్యారు. సభ దిగ్విజమయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. తుక్కుగూడ సభకు పది లక్షల మంది జనసమీకరణ లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రతి బూతు నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని ముఖ్య పరిశీలకులకు కాంగ్రెస్ సూచించింది. మూడురోజుల్లో ఏఏ నియోజవర్గాల నుంచి ఎంతమంది జనం వస్తారో నివేదిక ఇవ్వాలని PCC స్పష్టం చేసింది. విజయభేరి సభావేదికకు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌,ఇతర రాష్ట్ర నేతలతో కలిసి భూమిపూజ నిర్వహించారు.

Tags:    

Similar News