Telangana News : గ్రామాల్లో పట్టు కోసం కాంగ్రెస్.. హిల్ట్ పై బీఆర్ ఎస్..!
ప్రస్తుతం తెలంగాణ గ్రామాల్లో ఎన్నికల సందడి జోరుగా నడుస్తోంది. గ్రామాల్లో కాంగ్రెస్, బీఆర్ ఎస్ మధ్యనే ప్రధాన పోటీ కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి జిల్లాల్లో విజయోత్సవ సభలతో ఎక్కువ గ్రామాలు గెలవాలని చూస్తున్నారు. బీఆర్ ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు హిల్ట్ పాలసీపై పోరాడుతున్నారు. ఎవరు గ్రామాల్లో పట్టు సాధిస్తే వారికే వచ్చే లోకల్ బాడీస్, ఇతర ఎన్నికల్లో బలం ఏర్పడుతుంది. అందుకే ఇరు పార్టీలూ గ్రామాల్లో ఫుల్ ఫోకస్ పెట్టాయి. రేవంత్ రెడ్డి సీఎం అయి రెండేళ్లు అవుతున్న సందర్భంగా జిల్లాల్లో విజయోత్సవ సభలు పెడుతున్నారు. ప్రభుత్వం మారాక గ్రామాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నాయనే భావనతో, ఆ జోష్‌ను ఓట్లుగా మార్చాలని చూసే ప్రయత్నంలో కాంగ్రెస్ లీడర్షిప్ ఉంది. గ్రామాల్లో రేవంత్ గాలి బాగానే ఉందనేది కాంగ్రెస్ టాప్ లీడర్ల అంచనా. అందుకే గ్రామాల్లోనే ఎమ్మెల్యేలు మకాం వేసి సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకునే పనిలో పడ్డారు.
అదే సమయంలో బీఆర్‌ఎస్ మాత్రం గ్రామ ఎన్నికలను అంత సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించట్లేదు. ముందులా ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడగడం కంటే, ఈసారి హిల్ట్ పాలసీ మెయిన్ అజెండాగా చేసుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు గ్రామాలపై ఫోకస్ పెట్టకుండా హిల్ట్ నిర్ణయం వల్ల ప్రజలపై పడే ప్రభావం, నష్టాలపైనే పోరాడుతున్నారు. కాంగ్రెస్ గ్రామాలను కైవసం చేసుకోవాలని చూసే సమయంలో… బీఆర్‌ఎస్ మాత్రం గ్రామాల్లో అంత లోతుగా వెళ్లట్లేదని తెలుస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావలనే లక్ష్యంతో హిల్ట్‌ను ఆయుధంగా మార్చుకుంటోంది బీఆర్ ఎస్.
తమ ప్రభుత్వం చేసిన పనులు, కొత్తగా వచ్చిన స్కీమ్‌లను ప్రజలకు వివరించడంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారు. ఇక బీజేపీ, ఇతర పార్టీలు గ్రామాల్లో ఉన్నా… రియల్ పోటీ మాత్రం కాంగ్రెస్–బీఆర్‌ఎస్ మధ్యనే కనిపిస్తోంది. రెండూ అగ్రెసివ్ కాంపెయిన్ చేస్తుండటంతో గ్రామాల్లో కూడా పోరాట వాతావరణం ఏర్పడుతోంది. మొత్తానికి, తెలంగాణ గ్రామాల్లో పాలసీలు, లీడర్ల స్ట్రాటజీలు, స్థానిక లీడర్ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మరి కాంగ్రెస్ వేస్తున్న ప్లాన్ నెగ్గుతుందా లేదంటే బీఆర్ ఎస్ పార్టీ చేస్తున్న పోరాటం ఫలిస్తుందా అనేది చూద్దాం.