ఎంత పనిచేశావ్ అక్కా.. రూ.1,300 చూసుకుంటే 3,000 పడింది!
హెల్మెట్ కచ్చితంగా ధరించండి.. సీటు బెల్ట్ పెట్టుకోండి.. తాగి డ్రైవ్ చేయొద్దు. ఇవి ట్రాఫిక్ రూల్స్.. పాటిస్తే మనకే మంచిది. లేదంటే పోయేది మన ప్రాణాలే..;
హెల్మెట్ కచ్చితంగా ధరించండి.. సీటు బెల్ట్ పెట్టుకోండి.. తాగి డ్రైవ్ చేయొద్దు. ఇవి ట్రాఫిక్ రూల్స్.. పాటిస్తే మనకే మంచిది. లేదంటే పోయేది మన ప్రాణాలే.. కానీ ఈ రూల్స్ మాకు అవసరం లేదన్నట్టుగా కొందరు ప్రవర్తిస్తుంటారు. ఇష్టమొచ్చినట్లు వాహనాలు నడుపుతారు. ఇంకా చలానాల నుంచి తప్పించుకోవడానికి వేసే వేషాలు అయితే అన్ని ఇన్నీ కావు. ఆ కేటగరీలో వారికి ఆస్కార్ ఇచ్చిన తక్కువే.. నెంబరు ప్లేట్ మీద చున్నీ వేయడం, టీఎస్ తర్వత వచ్చే ఆల్ఫాబెట్ సిరీస్ కనిపించకుండా చేయడం ఇలా చేస్తుంటారు. అదృష్టం బాగుండి తప్పించుకుంటే పర్వాలేదు. కానీ దొరికితే మాత్రం ట్రాఫిక్ పోలీసులు తాటా తీయడం ఖాయం.
తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేసిన ఓ ట్వీట్ తెగ వైరలవుతోంది. "చలానాలు పడకుండా ఉండాలంటే ట్రాఫిక్ నియమాలు పాటించడం ఒకటే ఉత్తమ మార్గం, విన్యాసాలు చేసి తప్పించుకోవడం కాదు" అని పోస్ట్ చేస్తూ ఓ మీమ్ క్రియేట్ చేశారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన ఈ ఫోటోలో ఓ బైక్ మీద ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. అందులో బైక్ నడిపే వ్యక్తికి హెల్మెట్ ఉంది. అయితే ట్రిపుల్ రైడింగ్ చేయడం అనేది రూల్స్ కి విరుద్దం.. దాంతో బైక్ మీద వెనుక కూర్చున్న ఓ మహిళ అతితెలివితో నంబర్ ప్లేట్ సరిగా కనపడకుండా నెంబర్ ప్లేట్ పైన కాలు పెట్టింది. ఇది కాస్తా ట్రాఫిక్ పోలిసుల కంట్లో పడింది. ఇంకేముంది బైక్ నంబర్ ప్లేట్‌ని గుర్తించి 2,800 రూపాయల చలానా విధించారు.
నెంబర్ ప్లేట్ దాచినందుకు 500 రూపాయలు.. ప్రమాదకర డ్రైవింగ్‌కు 1,000 రూపాయలు.. ట్రిపుల్ డ్రైవింగ్‌కు 1,200.. వెనక కూర్చున్న వారికి హెల్మెట్ లేనందుకు గాను 100 రూపాయల చొప్పున మొత్తం 2,800 రూపాయల చలానా విధించారు. అంతేకాకుండా ''నువ్వేమో 1,300 రూపాయలు కాపాడలని కాలు పెట్టావ్.. కానీ నువ్వు చేసిన పనికి ఇంకో 1500 రూపాయలు ఎక్కువ పడ్డాయి'' అంటూ అత్తారింటికి దారేది సినిమాలోని క్లైమాక్స్ సీన్‌ని మీమ్ గా మార్చి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.