తెలంగాణలో శని, ఆదివారాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడి తుఫానుగా మారింది. ప్రస్తుతం దానా తుఫాను వాయువ్య దిశగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని.. ప్రస్తుతం బెంగాల్‌కు ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. వాయువ్య దిశగా పయనించి గురువారం తెల్లవారు జామున తీవ్ర తుఫానుగా బలపడుతుందని చెప్పింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య పూరీ, సాగర్ ద్వీపం మధ్య భిటార్కనికా, ఢమరా మధ్య 24,-25 తేదీల మధ్య తుఫాను తీరం దాటుందని చెప్పింది. గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ఇక రాష్ట్రంలో బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని పేర్కొంది. ఇక శనివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆదివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే సూచనలున్నాయని వివరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.