జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ దసరా వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. దసరా సందర్భంగా నిన్న రాత్రి మహిషాసుర దహనం కార్యక్రమానికి స్థానిక యువకులు ఏర్పాట్లు చేశారు. ఆ దిష్టిబొమ్మపైకి యశ్వంత్ అనే యువకుడు పెట్రోల్‌పోసి నిప్పుపెట్టడానికి అంతా సిద్ధం చేస్తున్నాడు. ఇంతలోనే రెండు వర్గాల మధ్య చిన్నపాటి ఘర్షణ చెలరేగింది. దీనిపై వాగ్వాదం జరుగుతుండగానే ఎవరో ఒక వ్యక్తి ఆ బొమ్మపైకి నిప్పు విసరడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో దానిపక్కనే ఉన్న యశ్వంత్‌కు కూడా మంటలు అంటుకున్నాయి. పెట్రోల్ కావడంతో అగ్నికీలలు క్షణాల్లో వ్యాపించాయి. ఒళ్లు అంటుకోవడంతో యశ్వంత్ భయంతో పరుగులుపెట్టాడు. అప్రమత్తమైన మిగతా యువకులు వెంటనే అతన్ని కాపాడారు. మంటలు ఆర్పేసి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు.
హహిషాసుర దహనం కోసం ఆ యువకుడు దానిపై పెట్రోల్ పోస్తున్నాడు. ఇంతలోనే గుర్తు తెలియని వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే అగ్గిపుల్ల విసిరినట్టు విజువల్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. అతనెవరు, ఎందుకలా చేశాడో కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మహిషాసురుడి బొమ్మకి టపాసులు కూడా కట్టి ఉండడం, పెట్రోల్ పోసిన వెంటనే నిప్పు విసరడంతో బాణాసంచా పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఊహించని ఈ పరిణామంతో అంతా భయంతో పరుగులు తీశారు. తీవ్రంగా గాయపడ్డ యువకుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.