దీక్షిత్‌ అంత్యక్రియలు పూర్తి.. నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ డిమాండ్‌

Update: 2020-10-23 04:00 GMT

మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. తీవ్ర కలకలం రేపిన దీక్షిత్‌రెడ్డి అనే తొమ్మిదేళ్ల బాలుడి కిడ్నాప్‌ విషాదాంతమైంది. కేసముద్రం మండలం అన్నారం శివారులోని గుట్టపై బాలుడి మృతదేహాన్ని గురువారం పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్లు బాలుడిని హత్య చేసి... పెట్రోల్‌ పోసి.. తగులబెట్టారు. మృతదేహం కనీసం గుర్తు పట్టడానికి కూడా వీల్లేని స్థితిలో ఉంది. బాలుడి మృతదేహం లభ్యమైన ప్రాంతంలోకి పోలీసులు ఎవరినీ అనుమతించకుండా.. కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. దీక్షిత్‌ మరణ వార్త తెలియగానే బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

మహబూబాబాద్‌లోని కృష్ణ కాలనీలో నివాసం ఉంటున్న రంజిత్‌, వసంత పెద్ద కుమారుడు దీక్షిత్‌... ఆదివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తి... బైక్‌పై వచ్చి తీసుకెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడని.. బాలుడి మిత్రులు చెప్పారు. రాత్రి 9 గంటల 45 నిమిషాలకు కిడ్నాపర్లు తల్లి వసంతకు ఫోన్ చేసి 45 లక్షల రూపాయలు ఇస్తే బాలుడిని విడిచిపెడతామని.. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని హెచ్చరించారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో మరోసారి ఫోన్ చేసిన దుండగులు.. డబ్బులు సిద్ధం చేయాలని చెప్పారు.

బుధవారం ఉదయం 11 గంటలకు మరోసారి ఫోన్‌ చేసిన దుండగుడు.. డబ్బును మహబూబాబాద్‌లోని మూడు కొట్ల ప్రాంతానికి రావాలని సూచించాడు. కిడ్నాపర్‌ డిమాండ్‌ చేసిన దాంట్లో కొంత డబ్బును సర్దుబాటు చేసుకున్న బాలుడి తండ్రి.. మధ్యాహ్నం ఒంటి గంటకు.. కిడ్నాపర్‌ చెప్పిన ప్రాంతానికి వెళ్లాడు. కానీ దుండగుడు రాలేదు. రాత్రి వరకూ ఎదురు చూసిన బాలుడి తండ్రి.. ఇంటికి తిరిగివచ్చేశారు.

అయితే... ఈ కేసు దర్యాప్తు పోలీసులకు సవాలుగా నిలిచింది. నిందితులు సాధారణ ఫోన్‌ కాల్‌ చేయకుండా.. ఇంటర్‌నెట్‌ కాల్‌ చేశారు. అయినప్పటికీ హైదరాబాద్‌లోని సైబర్‌ క్రైమ్‌ విభాగం సాయంతో కేసును పోలీసులు చేధించారు. కాల్‌ మాట్లాడిన నిందితుడిని అరెస్టు చేశారు. బాలుడు హత్యకు గురైనట్టు గుర్తించారు. కిడ్నాపర్‌ మంద సాగర్‌.. ముందుగానే రెక్కీ నిర్వహించి.. సీసీ కెమెరాల్లో ఎక్కడా దొరక్కుండా జాగ్రత్త పడ్డాడని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. కానీ.. కలెక్టరేట్‌ వద్ద ఉన్న సీసీ కెమెరాలో ద్విచక్రవాహనంపై బాలుడిని తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయని తెలిపారు. మెకానిక్‌గా పనిచేసే మందసాగర్‌.. దీక్షిత్‌రెడ్డి ఇంటికి సమీపంలోనే ఉంటాడని చెప్పారు. కిడ్నాప్‌ చేసిన గంటన్నరకే బాలుడిని హత్య చేసినట్టు వెల్లడించారు.

డబ్బు సంపాదించాలనే దురాశతోనే కిడ్నాపర్‌ కిరాతకానికి ఒడిగట్టాడని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మందసాగర్‌తో పాటు మనోజ్‌రెడ్డి అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. కిడ్నాప్‌, హత్యలో అతని పాత్రపైనా విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. అటు.. నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ స్థానికులు, సోషల్‌ మీడియాలో పలువురి నుంచి డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News