Telangana : కాంగ్రెస్ కీలక నేతలతో దీపాదాస్ మున్షీ భేటీ.. అజెండా ఇదే

Update: 2025-02-06 08:00 GMT

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్‌- ఈ 4 అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. రాజకీయాంశాలు కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో రెండు మూడు జిల్లాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమవుతారు. ఒకపక్క ఎస్సీ వర్గీకరణ అమలుకు సర్కారు శ్రీకారం చుట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మరోపక్క తాము కోరిన పనులు కాలేదంటూ కొందరు పార్టీ ఎమ్మెల్యేలు డిన్నర్‌ సమావేశం ఏర్పాటు చేసుకోవడం చర్చనీయంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం నెలకొంది.

ముందుగా పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్, దీపా దాస్‌మున్షీ సమావేశమవుతారు. తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలతో, అనంతరం కరీంనగర్, వరంగల్‌, నల్గొండ, హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీ ఉంటుంది. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో మాట్లాడే సమయంలో ఆ జిల్లాల్లోని మంత్రులు, ఇన్‌ఛార్జి మంత్రులు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య, ఎమ్మెల్యేలు-జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మధ్య సమన్వయం పెరగడానికి దోహదపడుతుందని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది.  

Tags:    

Similar News