Deepti Zivanji: మంత్రి సీతక్కను కలిసిన పారాఅథ్లెట్ దీప్తి జీవాంజి
ఇప్పటికే దీప్తికి భారీ నజరానా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం;
పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ పారాఅథ్లెట్ దీప్తి జీవాంజి మంత్రి సీతక్కను కలిశారు. శాట్ ఛైర్మన్ శివసేనా రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ ముత్తినేని వీరయ్యతో కలిసి ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కతో దీప్తి భేటీ అయ్యారు. యువ అథ్లెట్ దీప్తి జీవాంజి, కోచ్ రమేశ్‌లను మంత్రి సీతక్క సత్కరించారు. ఈ సందర్భంగా దీప్తిని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
పారిస్ పారాలింపిక్స్ 2024లో మహిళల 400 మీటర్ల టీ20 క్లాస్‌లో దీప్తి కాంస్య పతకం గెలుచుకున్నారు. పారాలింపిక్స్ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా వరంగల్‌కు చెందిన దీప్తి చరిత్ర సృష్టించారు. పారాలింపిక్స్‌లో భారత జెండాను రెపరెపలాడించిన అథ్లెట్ దీప్తిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. అంతేకాదు భారీ నజరానా ప్రకటించారు.
పారాలింపిక్స్‌లో సత్తా చాటినందుకు గాను దీప్తి జీవాంజికి రూ.కోటి నగదుతో పాటు గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాదు దీప్తి కోచ్‌కు రూ.10 లక్షల నజరానా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పారాలింపిక్స్ క్రీడాకారులకు శిక్షణ, ప్రోత్సాహానికి ఏర్పాట్లు చేయాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీప్తికి భారీ నజరానా ప్రకటించిన సీఎంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలంగాణకు తొలిసారిగా పతకాన్ని అందించిన దీప్తి స్వస్థలం వరంగల్ జిల్లా కల్లెడ గ్రామం.