Telangana News : ఫిరాయింపు మంచిదా.. ప్రజల మద్దతు అక్కర్లేదా..?

Update: 2026-01-16 09:57 GMT

తెలంగాణలో ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ ఎస్ నుంచి పది మంది కాంగ్రెస్ లో చేరారని.. వారిపై అనర్హత వేయాలంటూ బీఆర్ ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. స్పీకర్ వద్ద చేర్చుకోవాలంని కోర్టు సూచించడంతో.. చివరకు స్పీకర్ ఇప్పటి వరకు ఏడుగురికి క్లీన్ చిట్ ఇచ్చారు. వారు కాంగ్రెస్ లో చేరినట్టు సాక్ష్యాలు లేవని.. కాబట్టి వారిపై అనర్హత వేయడం కుదరదు అన్నారు. ఇంకో ముగ్గురి విషయంలో తీర్పు ఇవ్వాల్సి ఉంది. కడియం శ్రీహరి, సంజయ్ విషయంలోనూ ఇదే తీర్పు రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. అయితే దానం నాగేందర్ కాంగ్రెస్ గుర్తుపై ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఆయనపై అనర్హత తప్పేలా లేదు. కాకపోతే ఫిరాయింపు అనేది ఎంత వరకు మంచిది అనేది ఇక్కడ పాయింట్. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు.

ఇటు ఏపీలో వైసీపీ, టీడీపీ కూడా ఇలాగే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తీసుకున్నారు. కాకపోతే ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వ్యక్తి.. ఇంకో పార్టీలోకి వెళ్లడం వల్ల ప్రజాస్వామ్యానికి, ప్రజల అభిప్రాయానికి గుర్తింపు లేకుండా పోతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక అభ్యర్థిని ఒక గుర్తుపై ప్రజలు ఎన్నుకుంటారు. కానీ అతను ఇంకో పార్టీలోకి వెళ్తే ఇక ప్రజల ఓటుకు గుర్తింపు ఏముంది. ఇక్కడ ఏ ఎమ్మెల్యే అయినా సరే ఇంకో పార్టీలోకి వెళ్లాలి అనుకున్నప్పుడు ఆయన పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి.

గతంలో ఎంతో మంది గొప్ప నాయకులు ఇలాంటి సిద్ధాంతాలను పాటించారు. ఒక పార్టీ నుంచి గెలిస్తే అదే పార్టీలో కొనసాగారు తప్ప.. అధికారం కోసం లేదా పదవుల కోసం పార్టీలు మారలేదు. ఒక సుందరయ్య, వెంకయ్యనాయుడు లాంటి ఎందరో లీడర్లు ఒకే పార్టీలో చివరి దాకా కొనసాగారు. కానీ ఇప్పటి ఎమ్మెల్యేలు మాత్రం అధికార పార్టీ ఏదైనా పదవి ఇస్తామంటే వెంటనే చేరిపోతున్నారు. ఇది రాజ్యాంగానికే విరుద్ధం. కాబట్టి ఇక నుంచి ఇలాంటి రాజకీయాలు కాకుండా ప్రజలను గౌరవించే రాజకీయాలు చేస్తే బెటర్ అంటున్నారు నెటిజన్లు.

Tags:    

Similar News