చిక్కుల్లో పడ్డ ఫిరాయింపు ఎమ్మెల్యేలు

Update: 2025-10-11 12:54 GMT

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇరకాటంలో పడ్డారు. బీఆర్ ఎస్ లో ఉండలేక, కాంగ్రెస్ లోకి వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు. అసలు తమ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో తెలియక అనుచరులు అయోమయంలో పడ్డారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని వాళ్లు చెబుతున్నారు. దీంతో బీఆర్ ఎస్ లో తిరగలేక.. కాంగ్రెస్ కండువా వేసుకుని బయట కనిపించలేక సతమతం అవుతున్నారు. అసలు ఏ పార్టీలో ఉన్నారో వారు క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. ఇంకోవైపు స్పీకర్ విచారణ కొలిక్కి రాకపోవడంతో వీళ్లు పలానా పార్టీ అని చెప్పుకోలేకపోతున్నారు.

పోనీ తమ అనుచరులను వెంటేసుకుని తిరుగుదామంటే.. ఏ పార్టీ వారిని రమ్మంటే ఏం అవుతుందో అనే టెన్షన్ ఎమ్మెల్యేల్లో మొదలైంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా తాము పార్టీ మారలేదని మీదకు చెబుతున్నారు. కానీ వారి కింది స్థాయి నాయకులు మొత్తం పార్టీ మారిపోయారు. కాబట్టి ఇప్పుడు వాళ్లను ఏ పార్టీ కండువా వేసుకోకుండా ఉంచడం పెద్ద సవాల్ అయిపోయింది. బీఆర్ ఎస్ గుర్తుపై గెలిచిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పరిస్థితి అధ్వానంగా మారింది. వీరిద్దరూ సీఎం దగ్గర కండువా కప్పుకున్న ఫొటోలే బీఆర్ ఎస్ దగ్గర ఉన్నాయి. కానీ వీరు బీఆర్ ఎస్ లో తిరగలేని పరిస్థితి నెలకొంది.

వీరిద్దరే కాదు.. బీఆర్ ఎస్ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారంతా.. ఏ పార్టీలో ఉన్నామంటే క్లారిటీగా చెప్పలేని పరిస్థితి. తమ నియోజకవర్గాల్లో బీఆర్ ఎస్ మీటింగులకు వీరు వెళ్లట్లేదు. అలా అని కాంగ్రెస్ మీటింగులకు వెళ్లలేని పరిస్థితి తయారైంది. సొంతంగానే తిరుగుతున్నారే తప్ప.. ఏ పార్టీకి టచ్ లో ఉండలేకపోతున్నారు. స్పీకర్ వద్ద విచారణ ముగిసి ఏదో ఒకటి ఫైనల్ అయితే తప్ప వీరికి ఇంకొన్నాళ్లు ఇబ్బందులు తప్పవు. వీరి ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయించాలని బీఆర్ ఎస్ పట్టుబడుతోంది. కాబట్టి వెనక్కు రాలేక.. ముందుకు వెళ్లలేక వీరంతా గమ్మున ఉండిపోతున్నారు. మరి స్పీకర్ వీరి పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.

Tags:    

Similar News