Telangana BJP : బిజెపి నేతలకు పెద్ద టార్గెట్..

Update: 2026-02-10 05:30 GMT

తెలంగాణ బిజెపి నేతలకు ఢిల్లీ పెద్దలు పెద్ద టార్గెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి ఆ పార్టీ అనుకున్న స్థాయిలో గ్రాఫ్ పెంచుకోవట్లేదు. పైగా ఆ పార్టీ నేతలు గతంలో మాదిరిగా యాక్టివ్ గా కనిపించట్లేదని ఢిల్లీ పెద్దల దాకా ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన రెండు ఉప ఎన్నికల్లో, రీసెంట్ గా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చాలా పేలవమైన ప్రదర్శన చూపించింది బిజెపి పార్టీ. కనీస స్థాయి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. దీనిపై కొత్తగా వచ్చిన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఆయన తెలంగాణకు వచ్చి బిజెపి నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన.. ఇకనుంచి ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాతో కాకుండా.. మీరే సొంతంగా కష్టపడి సీట్లు గెలవాలని సూచించారు అంట.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలవాలి అంటే.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలని సూచించారు అంట. బిజెపి పార్టీకి ఎలాగూ గ్రామాల్లో పెద్దగా ఆదరణ ఉండదని.. కాబట్టి అర్బన్ ఎన్నికల్లో కచ్చితంగా సీట్లు సాధిస్తేనే ఆ ఎఫెక్ట్ రాబోయే ఎన్నికలపై ఉంటుందని ఖచ్చితమైన టార్గెట్లు ఇచ్చారంట. అందుకే బిజెపి నేతలు కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టు తమకు అప్పగించిన స్థానాల్లో బలంగా ప్రచారం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పెద్దగా కనబడని నేతలు అంతా.. మున్సిపల్ బరిలో దూసుకుపోతున్నారు. ఆయా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు తమ నియోజకవర్గాల్లో జరుగుతున్న మున్సిపల్ పోరులో తమ పట్టు నిలుపుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

తమవారికి టికెట్లు ఇప్పించుకున్న ఈ నేతలు అంతా.. వారందరినీ గెలిపించుకొని కేంద్రం వద్ద క్రెడిట్ కొట్టేయాలని ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తే వారికి పార్టీ మీద పట్టు పెరుగుతుందని ఆలోచనలో కూడా ఉన్నారంట. అందుకే పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. మరి బిజెపి నేతల్లో ఎవరు ఎక్కువ సీట్లు సాధించి సత్తా చాటుతారు అనేది విలిచి చూడాలి.

Tags:    

Similar News