Zomato: జొమాటో ముసుగులో గంజాయి సరఫరా.. డెలివరీ బాయ్ అరెస్ట్
Zomato: జొమాటో ముసుగులో గంజాయి సరఫరా చేస్తున్న ఫుడ్ డెలీవరి బాయ్‌ను సికింద్రాబాద్ తుకారాం గేటు పోలీసులు అరెస్టు చేశారు.;
Zomato: జొమాటో ముసుగులో గంజాయి సరఫరా చేస్తున్న ఫుడ్ డెలీవరి బాయ్‌ను సికింద్రాబాద్ తుకారాం గేటు పోలీసులు అరెస్టు చేశారు. నేరెడ్‌మెట్ మధురానగర్‌కు చెందిన సతీష్ చంద్ర జొమాటోలో ఫుడ్ డెలీవరి బాయ్‌గా పని చేస్తున్నాడు. సతీష్ చంద్రకు గంజాయి అలవాటు ఉంది.
ఇదే క్రమంలో జవహర్‌నగర్‌కు చెందిన మాదక ద్రవ్యాల వ్యాపారి రాహుల్‌తో సతీష్ చంద్రకు పరిచయమేర్పడింది. రాహుల్ సూచనతో కస్టమర్లకు గంజాయి సరఫరా చేయడం ప్రారంభించాడు సతీష్. అనుమానం రాకుండా చిరుత, కలాకాన్ స్వీట్ బాక్స్ లాంటి కోడ్ పదాలు ఉపయోగిస్తు గంజాయి డెలివరీ చేసేవాడు. ఫ్రెండ్ ఐడీతోనూ ఈ దందా సాగిస్తున్నాడు.
తాజాగా ఈ నెల 11న రాహుల్ దగ్గర మూడు గంజాయి ప్యాకెట్లు తీసుకున్న సతీష్..తుకారాం గేట్‌లో ఇచ్చేందుకు రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాహుల్ కోసం ప్రయత్నించగా..అప్పటికే అతడు భువనగిరి పోలీసులకు పాత కేసులో లొంగిపోయినట్లు గుర్తించారు. వీరి దగ్గర గంజాయి తీసుకున్న 30 మందిని గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.