ములుగు జిల్లా చెల్పాక వద్ద జరిగిన ఎదురుకాల్పుల ఘటనపై వస్తున్నవన్నీ అవాస్తవ ఆరోపణలనేనని డీజీపీ జితేందర్ ఖండించారు. విష ప్రయోగం చేసిన తర్వాత మావోయిస్టులు సృహకోల్పోయిన తర్వాత కాల్పులు జరిపారని పౌర హక్కుల సంఘం చేస్తున్న ఆరోపణలు ఏమాత్రం నిజం కాదన్నారు. డీజీపీ దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. ఇన్ ఫార్మర్ నెపంతో ఆదివాసులైన రమేశ్, ఉయిక అర్జున్ లను మావోయిస్టులు హత్య చేశారని, ఇలాంటి ఘటనలను అడ్డుకు నేందుకు పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా మావోయిస్టులు పోలీసులపై అకారణంగా కాల్పులు జరపడంతో ఎన్ కౌంటర్ జరిగిందని వివరించారు. మావోయిస్టులు అత్యాధునిక ఆయు ధాలను ఉపయోగించారని స్పష్టమైందన్నారు. ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారని, హైకోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్ సూచనల మేరకు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని తెలిపారు.