DGP: పోలీసు శాఖ ప్రతిష్ట పెంచుతా: కొత్త డీజీపీ
హైదరాబాద్ సీపీగా సజ్జనార్
తెలంగాణ పోలీసు శాఖ ప్రతిష్టను పెంచుతానని రాష్ట్రానికి కొత్త డీజీపీగా ఎన్నికైన బత్తుల శివధర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో సైబర్ నేరాలు, డ్రగ్స్ మాఫియాను పూర్తిగా నిర్మూలించాల్సిందేనని అన్నారు. ప్రజలకు పోలీసింగ్‌పై నమ్మకాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తానని.. పోలీసు వృతి అంటే తనకెంతో ఇష్టమని అన్నారు. న్యాయవాద వృత్తిని వదిలి పట్టుదలతో సివిల్స్‌కు ప్రిపేర్ అయి ఐపీఎస్ సాధించానని తెలిపారు. మవోయిస్టుల వ్యవస్థ దాదాపు అంతమైనట్లేనని అన్నారు. గతంలో వివిధ జిల్లాల ఎస్పీగా, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన అనుభవంతో తెలంగాణ తనకు పూర్తి పట్టు ఉందని డీజీపీ బత్తుల శివధర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని నూతన డీజీపీ వెల్లడించారు. ఇప్పటికే తెలంగాణ నూతన డీజీపీగా శివధర్‌రెడ్డి నియమితులయ్యారు. 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శివధర్‌రెడ్డి.. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఛీఫ్‌గా ఉన్నారు. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్నారు. తెలంగాణలో పోలీసు శాఖ ప్రతిష్టను పెంచుతానని కొత్త డీజీపీ వెల్లడించారు.
సీపీగా సజ్జనార్
తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు, పోస్టింగ్‌లు చేపట్టింది. ఆరుగురు ఐఏఎస్, 23 మంది ఐపీఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి వేర్వేరుగా రెండు ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా వీసీ సజ్జనార్‌ను నియమించింది. ప్రస్తుతం వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనను హైదరాబాద్ సీపీగా బదిలీ చేసింది. ఇక, ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్ బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్ర ఇంటెలిజెనర్స్ చీఫ్‌గా విజయ్‌కుమార్‌ను నియమిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రఘునందన్‌రావుకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్, సురేంద్ర మోహన్‌కు వ్యవసాయశాఖలను అప్పగించింది.
సిరిసిల్ల కలెక్టర్‌గా హరిత...
ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా ఎం హరిత నియమితులయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహారం గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తరుచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆయనపై ప్రభుత్వ వర్గాలు సీరియస్ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా బదిలీల్లో ఆయనకు స్థానచలనం కలిగింది. సందీపకుమార్ ఝాకు టీఆర్ అండ్ బీ విభాగంలో స్పెషల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించింది.