ఆర్టీసీ ఉద్యోగులకు దసరా పండుగ అడ్వాన్స్ ఇవ్వాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. ఉద్యోగుల హోదా, నెల జీతం ఆధారంగా అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది. తిరిగి వారి జీతం నుంచి నెలకు కొంత మొత్తంలో వసూలు చేస్తామని పేర్కొంది. ఈ మేరకు అధికారులతో సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే అడ్వాన్స్ చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, దసరా పండగ నేపథ్యంలో ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘం కొన్ని రోజులుగా యాజమాన్యాన్ని కోరుతోంది. టీజీఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని చెప్పింది.దసరా పండుగ సమయానికి ముందే ఈ సదుపాయం ఉద్యోగులకు అందేలా వేగవంతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంస్థ తరఫున తీసుకున్న ఈ నిర్ణయం, పండుగ సీజన్‌లో ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ఆనందాన్ని రెట్టింపు చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.