Telangana : 5 దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు..! కసరత్తు ప్రారంభించిన ఈసీ
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ను వేగవంతం చేశారు అధికారులు. ఇందులో భాగంగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి కసరత్తు పూర్తి చేసే పనిలో పడ్డారు అధికారులు. ఎన్నికలను ఐదు విడతల్లో నిర్వహించేలా ఎన్నికల కమిషన్ ఆలోచిస్తున్నది. వర్షాకాలం నేపథ్యంలో పోలింగ్కు అలాగే సిబ్బందికి కూడా ఇబ్బందులు ఉండనున్నాయని అందుకే ఐదు విడతల్లో ఎన్నికలను నిర్వహించడం మంచిదనే భావనలో ఉన్నారు అధికారులు. 2019లో ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. అప్పుడు ఎండాకాలం కావడం తో ఇబ్బందులు లేవని..ఐతే ఈసారి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడం కష్టమని భావిస్తున్నారు. గిరిజన ప్రాంతాలకు పోలింగ్ సిబ్బంది వెళ్లడం, పోలింగ్ సామాగ్రిని తరలించడం కష్టతరం అవుతుందని అందుకే ఐదు…అందుకే ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాలోచనలు చేస్తున్నారు.
కాగా ఇప్పటికే పోలింగ్ సిబ్బంది డేటాను సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించింది ఎన్నికల సంఘం. ప్రభుత్వం రిజర్వేషన్లను ఫైనల్ చేయగానే ఎన్నికల షెడ్యూల్ రానుంది. పోలింగ్ స్టేషన్లు, ఓటరు జాబితాను కూడా సిద్ధం చేశారు అధికారులు. ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించడం ద్వారా పోలింగ్ సిబ్బంది, పోలీసులను తరలించడం సులువు అవుతుందని, పర్యవేక్షణలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి పోలింగ్ వరకు ప్రక్రియను పూర్తి చేసేందుకు 15 రోజుల సమయం పడుతుంది. 2019 ఎన్నికల సమయంలో ఒక్కో దశకు నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చారు. కానీ ఈ సారి రెండు నుంచి మూడు రోజులు మాత్రమే ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం రిజర్వేషన్ల సమాచారం ఇచ్చాక.. పోలీసు అధికారుల తో సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం సర్పంచ్ ఎలక్షన్స్ జరగనున్నాయి.