BRS: బీఆర్ఎస్ ఆస్తులు అన్ని కోట్లా..?
భారీగా పెరిగిన బీజేపీ, కాంగ్రెస్ ఆదాయాలు... వార్షిక ఆడిట్ నివేదిక విడుదల చేసిన భారత ఎన్నికల సంఘం;
దేశంలోని రాజకీయ పార్టీలకు సంబంధించిన వార్షిక ఆడిట్ నివేదికను భారత ఎన్నికల సంఘంవిడుదల చేసింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఆస్తులపై మరోసారి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. 2024 మార్చి 31 నాటికి ఆ పార్టీ ఆస్తులు ఏకంగా రూ.1,618 కోట్లకు చేరాయి. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు బీఆర్ఎస్ అధికారికంగా అడిట్ వివరాలను అందించింది. బీఆర్ఎస్ వద్ద బ్యాంకు బ్యాలెన్స్ రూ.1,110 కోట్లు, 2023-24 ఆర్థిక ఏడాదిలో విరాళాల ద్వారా రూ.580.52 కోట్లు.. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా మరో రూ.101.76 కోట్లు వచ్చాయి.బీఆర్ఎస్ ఎన్నికల ఖర్చు వందల కోట్లు
ఎన్నికల ఖర్చు భారీగానే..
తెలంగాణలో 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ దాదాపు రూ.197 కోట్లు ఖర్చు చేసినట్టు ఆడిట్ రిపోర్టులో పేర్కొంది. ఇవి కేవలం అధికారిక లెక్కలే. వాస్తవంగా ఈ ఖర్చు ఇంతకు పదింతలు ఉంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో అభ్యర్థి రూ.40 లక్షల చెక్కులను ఎన్నికల ఖర్చుకోసం అందజేసింది. ఇలా సుమారు రూ.47 కోట్లను అభ్యర్థులకు అందించింది. ప్రకటనల కోసం రూ.75 కోట్లు.. బహిరంగ సభలకు రూ.30 కోట్లు ఖర్చు చేసింది.
బీజేపీ ఆదాయం వేల కోట్లు..
2023-2024 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వార్షిక ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంది. గతేడాది కాలంలో బీజేపీ ఆదాయం 83 శాతం పెరిగింది. 2022-23లో రూ. 2360.8 కోట్ల నుంచి 2023-24 నాటికి రూ. 4340.5 కోట్లకు పెరిగింది. ఇందులో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.1685.6 కోట్లు వచ్చాయి. ఆ పార్టీ వద్ద 2024 మార్చి 31 నాటికి రూ. వద్ద రూ. 7,113.80 కోట్ల నగదు ఉండగా దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా ఉంది. కాంగ్రెస్ ఆదాయం 170 శాతం పెరిగి రూ.1225 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం ఆ పార్టీ వద్ద రూ. 857.15 కోట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 2022-23లో రూ.192.56 కోట్లు ఖర్చు చేయగా.. 2023-24లో రూ.619.67 కోట్లు ఖర్చు చేసినట్టు ఈసీ తెలిపింది.