రూ.700 కోట్ల గొర్రెల స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వెటర్నరీ డిపార్ట్మెంట్ స్కీమ్ మార్గదర్శకాలు, లబ్ధిదారుల జాబితాను ఈడీకి అందజేసింది. మరోవైపు స్కీమ్ కు సంబంధించి పూర్తి రిపోర్ట్‌ను ఈడీ, ఏసీబీలకు గొర్రెలు, మేకల పెంపకందారుల సమాఖ్య అందచేసింది. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ స్కామ్ కేసును మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద విచారణ చేపట్టనున్నామని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్‌కు హైదరాబాద్‌లోని ఈడీ జోనల్ కార్యాలయం సంయుక్త సంచాలకుడు గతంలో లేఖ రాశారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల కొనుగోళ్ల కోసం సమాఖ్య నుంచి ఏయే జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు, ఏ ఏ ఖాతాల్లో జమ అయ్యాయి?, వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది.