Editorial: శంకర్ నాయక్ నోటి దురుసుపై మల్లగుల్లాలు..
శంకర్ నాయక్ పై నోటివాటంపై పార్టీలో చర్చోపచర్చలు; సొంత పార్టీ నేతేలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవైనం
మహబూబాబాద్ ఎమ్మేల్యే శంకర్ నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారారని నియోజక వర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయని టాక్ వినిపిస్తోంది. వైఎస్ షర్మిల తన పైన చేసిన విమర్శలను పట్టించుకోననని తాను సైగ చేస్తే సినిమా వేరేలా ఉండేదని... ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన కామెంట్స్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయట. అంతే కాదు తమ ప్రాంతానికి వచ్చే వలస పక్షుల్లారా ఖబడ్దార్ అంటు వార్నింగ్ ఇవ్వడమే కాకుండా ఎవరైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుక కోస్తానంటూ చేసిన హెచ్చరికలపై నియోజకవర్గ ప్రజల్లో చర్చ జరుగుతోందట.
ఇటీవలి కాలంలో మహబూబాబాద్ నియోజకవర్గం పై విపక్షాలతో పాటు స్వపక్షంలోని కొందరు నేతలు నియోజకవర్గంపై కన్నేశారట. శంకర్ నాయక్ పై అధిష్ఠానానికి మంచి అభిప్రాయం లేదని చెబుతూ సొంత ఎజెండాతో మంత్రి సత్యవతి రాథొడ్ ఎంపీ మాలోతు కవితలు మహబుబాబాద్ నియోజకవర్గం పైన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. అవకాశం దొరికినప్పుడల్లా శంకర్ నాయక్ ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. భూ కబ్జాల ఆరోపణలతో పాటు ఇతర అంశలాను తెరపైకి తెస్తూ అధిష్ఠానం వద్ద ఆభాసు పాలు చేస్తున్నారట. దీంతో విసిగిపోయిన శంకర్ నాయక్ అవకాశం కోసం వేచి చూస్తున్నారట. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల శంకర్ నాయక్ ని తీవ్రంగా విమర్శించారట. దీంతో విపక్షాలను టార్గెట్ చేయడమే కాకుండా పనిలో పనిగా స్వపక్షంలోని ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చేలా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనాలను వినియోగించుకున్నారన్న చర్చ జరుగుతోంది.
మరో వైపు సొంత పార్టీ నేతలు శంకర్ నాయక్ నోటి దురుసు తగ్గడంలేదని ఆరోపణలు చేస్తున్నారట. గతంలోనూ శంకర్ నాయక్ షర్మిల, రేవంత్ రెడ్డిలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారట. నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆంధ్ర నుంచి కొజ్జాల్లా ఉండే వాళ్లు కొందరు.. వలసవాదులు వస్తున్నారంటూ వివాదాస్పదవ్యాఖ్యలు చేయడంతో.. షర్మిల కూడా తన పాదయాత్రలో శంకర్ నాయక్ పై వ్యక్తిగతంగా విమర్శలకు దిగినట్లు సమాచారం. వలసవాదులు తమ అవసరాల కోసం తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన విమర్శలపై నియోజక వర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఇంతకూ శంకర్ నాయక్ నోటి దురుసుకి కారణమేంటా అని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట. ఉమ్మడి జిల్లాలో మాట జారిన నేతలు చాలామందే అధికారపార్టీలో ఉన్నప్పటికీ.. శంకర్ నాయక్ తరహాలో ఎవరూ దిగజారి విమర్శించలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విపక్ష నేతలతో పాటు సొంత పార్టీ నేతలను ఒకే గాటున కట్టి విమర్శిస్తుండటంతో బీఆర్ఎస్ లో శంకర్ నాయక్ తీరుపై చర్చ జరుగుతోందట. అటు ఆత్మీయ సమ్మేళనంలో శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలు తమకూ వర్తిస్తాయని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.