TS: తెలంగాణలో ప్రచార జోరు
ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థన.... సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో ఎన్నికల సందడి;
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల ప్రచార జోరు హోరెత్తుతోంది. ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థులు ఓట్లు అడుగుతున్నారు. మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో ఎన్నికల సందడి నెలకొంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో తొలిసారి పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్.. సార్వత్రిక ఎన్నికలను సవాల్‌గా తీసుకుంది. అధిక ఎంపీ స్థానాలు కైవసం చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సహా మంత్రులు, MLAలు, పార్టీ నేతలు తీరిక లేకుండా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని కాచిగూడలో సికింద్రాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్.. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్‌కు మద్ధతుగా C.P.M ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశానికి మంత్రి తుమ్మల హజరయ్యారు. నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డికి మద్ధతుగా నిలవాలని NRIలను కొరుతూ.. మాజీమంత్రి జానారెడ్డి, MLA జైవీర్‌రెడ్డి... వారితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్‌లో.. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్‌కు మద్దతుగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలో జరిగిన భారాస ప్రజా ఆశీర్వాద సభకు హరీష్ రావు హాజరయ్యారు. అనంతరం... హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో రోడ్ షోలో పాల్గొన్నారు. చేవెళ్ల లోక్‌సభ భారాస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్ధతుగా.. రంగారెడ్డి జిల్లా కౌకుంట్లలో మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో సికింద్రాబాద్ భారాసా ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్.. మాజీమంత్రి తలసానితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహబూబాబాద్ లోక్‌సభ భారాస అభ్యర్థి మాలోత్ కవితకు మద్ధతుగా... నర్సంపేట నియోజకవర్గంలో.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రచారం చేశారు.
సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎంపీ లక్ష్మణ్ పాదయాత్ర చేశారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచారు. కరీంనగర్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్.. మరోమారు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్‌లో నిర్వహించిన విద్యావంతులు, మేధావుల ఆత్మీయ సమావేశంలో... భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. హైదరాబాద్ లోక్‌సభ భాజపా అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా మాజీగవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎన్నికల ప్రచారం చేశారు. జియాగూడలో నిర్వహించిన గంగపుత్ర ఆత్మీయ సమ్మేళనంలో మాధవీలతతోపాటు పాల్గొన్నారు.