ELECTION: స్థానిక సంస్థల పోరుకు సర్వం సిద్ధం
ఈనెల 10 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్... తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు... ఆతర్వాతే సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 10 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మొదటగా మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (MPTC), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ZPTC) ఎన్నికలు నిర్వహిస్తారని మీడియాతో చిట్‌చాట్‌లో వెల్లడించారు. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మంత్రి ప్రకటనతో ఆశావాహులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఈ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు మొదలుపెట్టింది. సెప్టెంబర్ 10వ తేదీ నాటికి MPTT, ZPTC ఓటర్ల, పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రచురించాలని ఆదేశిస్తూ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 6న MPTT, ZPTC స్థానాల వారీగా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలు ప్రచురించనున్నారు. సెప్టెంబర్ 6-8 మధ్య ఈ ముసాయిదా జాబితాలపై ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 8న జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో MPDOలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 9న అభ్యంతరాలు, వినతులు పరిష్కరిస్తారు. సెప్టెంబర్ 10న ఓటర్ల, పోలింగ్ కేంద్రాల తుది జాబితాలు ముద్రిస్తారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం,ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు లోకల్ బాడీ ఎలక్షన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌లో ఎన్నికలు జరగాలన్న లేఖను ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అదేవిధంగా, రిజర్వేషన్లలో ఉన్న సీలింగ్ క్యాప్‌ను తొలగించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రత్యేక జీవో ద్వారా ఈ ఎన్నికలకు వెళ్ళాలని, అలాగే రిజర్వేషన్ల పరిమితిని తొలగిస్తూ అసెంబ్లీలో తగిన తీర్మానాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. ఈ బిల్లును త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. జూన్ 25న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడంపై అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ తీసుకొచ్చిన జీవోను అసెంబ్లీ ముందుకు కూడా తీసుకొచ్చింది. దీంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి.