తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం, రాష్ట్రంలో రాబోయే రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ , కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనగాం, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇంకా, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్ధిపేట, హనుమకొండ, యాదాద్రి జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాలకు అతి భారీ వర్షాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు తగిన సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.