CM Revanth Reddy : ఫేక్ జర్నలిస్టులతో దేశానికే ప్రమాదం - సీఎం రేవంత్ రెడ్డి

Update: 2025-08-02 12:45 GMT

స్వతంత్ర సంగ్రామ కాలంలో దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపి అందరినీ ఒక వేదికపైకి తేవడంలో పత్రికలు అపారమైన కృషి చేశాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు కొన్ని వింత పోకడలు పాత్రికేయ రంగానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి స్ఫూర్తినిచ్చే పత్రికా సంస్థలు కొన్ని మాత్రమే ఉంటాయని అభిప్రాయపడ్డారు.

జర్నలిస్టు ముసుగులో రాజకీయ పార్టీల కోసం ముందుకొస్తున్న వారిని సమాజం నిశితంగా గమనించాలని రేవంత్ అన్నారు. అలాంటి వారు వేరన్న విషయాన్ని అసలు సిసలైన జర్నలిస్టులు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. నిబద్ధత కలిగిన జర్నలిస్టులు ఈ వింత పోకడలపై సదస్సులు నిర్వహించి నిజమైన జర్నలిస్టులు ఎవరన్నది నిర్వచనం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఆ పని జరక్కపోతే పత్రికలకే కాదు, దేశ భద్రతకే ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. జర్నలిస్టుల ముసుగు తొడుక్కుని విద్రోహ చర్యలకు పాల్పడిన సంగతి ఇటీవల ఆపరేషన్ సిందూర్ సందర్భంగా కొందరిని అరెస్టు చేసిన ఘటనల్లో వెలుగులోకి వచ్చాయని గుర్తు చేశారు.

సామాజిక స్థితిగతులను అర్థం చేసుకోవడం, సంక్షేమ పథకాల్లో లోటుపాట్లను సరిదిద్దుకోవడంతో పాటు పరిపాలనలో పట్టు సాధించాలంటే పత్రికల్లో విశ్లేషణాత్మక కథనాలు ఎంతో అవసరమని రేవంత్ అభిప్రాయపడ్డారు. తప్పులు జరక్కుండా పరిపాలన అందించాలన్న ఉద్దేశంతో అలాంటి వాటిని తానెప్పుడూ గమనిస్తూనే ఉంటానని చెప్పారు. అబద్దాల పునాదులపైన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంటే అది ఏదో ఒకరోజు కూలుతుందని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News