ఈనెల 26 నుంచి ‘రైతు భరోసా’ సాయాన్ని పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. యాసంగి సీజన్‌కు సంబంధించి ఎకరానికి రూ. 6వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. సాగు భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇస్తున్న నేపథ్యంలో దాదాపు కోటి ఎకరాలకు ఈ పథకం అమలయ్యే అవకాశం ఉంది. అంటే రూ. 5,500 కోట్ల నుంచి రూ. 6,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. గత ప్రభుత్వం రూ. 1.52 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయాన్ని అందించింది.
రాష్ట్రంలో సాగుచేసే భూములు 1.48 కోట్ల ఎకరాల వరకు ఉన్నట్లు వ్యవసాయ, ఉద్యానవన శాఖల నివేదికలను బట్టి తెలుస్తోంది. ఇందులో వానాకాలం సీజన్‌ను ప్రామాణికంగా తీసుకుంటే రాష్ట్రంలో అత్యధికంగా 1.36 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వరి, పత్తి, మొక్క జొన్నతోపాటు వివిధ రకాల పంటలు సాగు చేసినట్లు రికార్డు ఉంది. ఇంతకు మించి ఏ సీజన్‌లోనూ పంటల విస్తీర్ణం పెరగలేదు.
మరో 12 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటలు మొదలు అన్ని రకాల ఉద్యాన పంటలు సాగవుతుంటాయి. మొత్తం 1.48 కోట్ల ఎకరాల్లోనే ‘పార్ట్–బీ’కేటగిరీ కింద 18 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయానికి పార్ట్–బీని మినహాయించారు. అయినా 1.52 కోట్ల ఎకరాలకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. అంటే 1.30 కోట్ల ఎకరాల సాగుభూమితోపాటు మరో 22 లక్షల ఎకరాల సాగులో లేని భూమికి కూడా రైతుబంధు లభించింది.