Telangana News : కడియం, దానం రాజీనామా తప్పదా..?

Update: 2025-11-24 07:00 GMT

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో వేగవంతమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయ్యింది. ఇప్పుడు దృష్టి పూర్తిగా దానం నాగేందర్, కడియం శ్రీహరిలపైనే ఉంది. 23వ తేదీలోపు అఫిడవిట్లు ఇవ్వాలని స్పీకర్ నోటీసులు ఇచ్చారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇంకా పత్రాలు ఇవ్వలేదు. బదులుగా మరింత గడువు కోరారు. దీంతో వీరి రాజకీయ భవితవ్యంపై అనుమానాలు మరింత పెరిగాయి. దానం నాగేందర్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫాం మీద ఎంపీగా పోటీ చేశారు. అందుకే పార్టీ మార్పు విషయంలో ఆయనపై ఒత్తిడి ఎక్కువగా ఉంది.

ఇక కడియం శ్రీహరి విషయానికి వస్తే, ఆయన వెనక్కు వెళ్లలేని విధంగా పరిస్థితి మారింది. పార్టీ అంచనాలు, రాజకీయ ఒత్తిళ్లు ఇలా ప్రతి కోణంలోనూ ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలనే వ్యూహంలో భాగంగా వీరిద్దరూ సైలెంట్ గా ఉంటున్నట్టు కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల తర్వాత ఈ ఇద్దరూ రాజీనామా చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఇద్దరూ రాజీనామా చేసిన తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారనేదానిపై ఆసక్తి పెరిగింది.

దీనిపై తాజాగా మంత్రివర్గంలో కీలక పాత్రలో ఉన్న మంత్రి శ్రీధర్ బాబుతో ఇద్దరూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రాజీనామా చేస్తే పార్టీ పరంగా మళ్లీ బీఫాం టికెట్లు ఇవ్వడంతో పాటు ఒకవేళ ఓడిపోతే ఇద్దరికీ ఎమ్మెల్సీలు ఇవ్వాలనే కండీషన్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఎమ్మెల్యే పదవులు త్యాగం చేసి మరీ వస్తున్నారు కాబట్టి ఆ కీలకమైన హామీ ఉండాలని వీరిద్దరూ పట్టుబడుతున్నారంట. ఈ విషయంపై పార్టీ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Tags:    

Similar News