GBS: హైదరాబాద్‌కి వచ్చేసిన గులియన్ బారే సిండ్రోమ్
సిద్ధిపేట మండలానికి చెందిన మహిళకు పాజిటివ్... అప్రమత్తమైన అధికారులు;
మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కలకలం రేపుతోన్న గులియన్ బారే సిండ్రోమ్ కేసు తెలంగాణలో నమోదైంది. హైదరాబాద్‌లో ఓ మహిళకు గులియన్ బారే సిండ్రోమ్ (GBS) ఉన్నట్లు నిర్ధారణ అయింది. హైదరాబాద్‌లో గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదైంది. సిద్దిపేట మండలానికి చెందిన మహిళకు జీబీఎస్ పాజిటివ్ అని డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ మహిళా పేషెంట్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స చేస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో ఇదివరకే దాదాపు 120 గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదయ్యాయి. ఈ జీబీఎస్ పాజిటివ్ గా తేలిన ముగ్గురు వ్యక్తులు పశ్చిమ బెంగాల్ లో ఇటీవల చనిపోవడంతో వైద్య నిపుణులు అప్రమత్తమయ్యారు.
మహారాష్ట్రలోనూ..
మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీగా గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రాల్లో జీబీఎస్ కేసులపై అప్రమత్తమై హాస్పిటల్స్ లో బెడ్స్ సిద్ధం చేస్తున్నారు. తీవ్రత అధికంగా ఉండదని డాక్టర్లు చెబుతున్నా.. పశ్చిమ బెంగాల్ లో రెండు రోజుల కిందట ముగ్గురు చనిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా జీబీఎస్ బారినపడే అవకాశాలు అధికంగా ఉంటాయని డాక్టర్లు తెలిపారు. జీబీఎస్ శరీరంలోకి చేరాక రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతూ నరాలపై దాడి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
లక్షణాలు ఇవే...
GBS వచ్చిన వారికి.. నీళ్ల విరేచనాలు, కడుపునొప్పి, జ్వరం, వికారం, వాంతి అయ్యేలా ఉంటుంది. కాళ్లలో తిమ్మిరి వస్తుంది. క్రమంగా అది పెరుగుతూ.. మొండెం వరకూ వచ్చేస్తుంది. ఆ తర్వాత కండరాలన్నీ వీక్ అవుతాయి. ఒక్కోసారి పక్షవాతం కూడా వస్తుంది. ఈ సిండ్రోమ్ వచ్చిన వారు సరిగా నడవలేరు, ముఖ కవళికలు ఈజీగా ఉండవు. సరిగా మాట్లాడలేరు, నమలలేరు, మింగలేరు. బ్యాలెన్స్‌తో నిలబడటం కూడా కష్టమవుతుంది. చివరకు రొమ్ము దగ్గర కండరాలు నీరసించి.. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది.