TG: విత్తనాల కోసం ఎదురుచూపులు
జనుము, జీలుగ విత్తనాల కోసం రైతుల పడిగాపులు... ఆగ్రో రైతు సేవా కేంద్రాల చుట్టూ రైతుల ప్రదక్షినలు;
తెలంగాణలో వర్షాకాలం సాగుకోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. జనుము, జీలుగ విత్తనాల కోసం.. అన్నదాతలు ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, ప్రభుత్వ విత్తన పంపిణీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. డిమాండ్ కు తగినట్లుగా నిల్వలు లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురైతున్నారు. అధికారులు మాత్రం పచ్చిరొట్ట విత్తనాల కొరత లేదని... రైతులకు సకాలంలో విత్తనాలు అందిస్తామంటున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పచ్చిరొట్ట విత్తనాలు కోసం అన్నదాతలు ఆగ్రో రైతు సేవా కేంద్రాలు చుట్టు తిరుగుతున్నారు. జీలుగు, జనుము విత్తనాల కోసం పడిగాపులు గాస్తున్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలు అన్నీ కలిపి మెుత్తం 5వేల8 వందల40 క్వింటాళ్ల విత్తనం అవసరం అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేయగా...2వేల3 వందల6 క్వింటాళ్ల విత్తనం మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. ప్రభుత్వం ఈ విత్తనాలపై 60శాతం రాయితీ అందిస్తుంటడంతో... కొనుగోలు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. కానీ డిమాండ్ తగ్గట్లుగా నిల్వలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
వానాకాలం పంటలు సాగుచేసే ముందు పచ్చిరొట్ట పంటలు సాగు చేసి భూమిలో కలియదున్నతే పంటకు, భూమికి కావాల్సిన పోషకాలు అందుతాయి. గతంలో దీనిపై రైతుల్లో పెద్దగా అవగాహన ఉండేదికాదు. పచ్చిరొట్ట సాగుపై వ్యవసాయ శాఖ సైతం విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో ఎక్కువమంది జీలుగు, జనుము సాగుపై ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి వానాలు మేనెలలోనే ప్రారంభమయ్యాయి. రైతులు ముందస్తుగా సాగుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో పచ్చిరొట్ట విత్తనాలకు డిమాండ్ ఏర్పడింది. జనుము కంటే జీనుగ వేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాల్ని దిగుమతి చేసుకోవడంలో జాప్యం జరుగుతోంది. దీంతో సకాలంలో విత్తనాలు అందడం లేదు..
అధికారులు మాత్రం విత్తనాలకు ఎలాంటి కొరత లేదని చెబుతున్నారు. ఇప్పుడున్న డిమాండ్ మేరకు ఉన్న నిల్వలు ఉన్నాయని...మరో రెండు రోజుల్లో మరిన్ని విత్తనాలు దిగుమతి అవుతాయని.. వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. పచ్చిరొట్ట విత్తనాలు నాటుకునేందుకు జూన్ మొదటి వారం వరకు సమయం ఉందంటున్నారు. తగినన్ని వర్షాలు పడకుండా...రైతులు తొందరపడి పచ్చిరొట్ట పంటల్ని వేయొద్దని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నీటి సౌకర్యం అందుబాటులో ఉంటేనే విత్తనాలు కొనుగోలు చేసి, సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. తగినన్ని విత్తనాలు మరో రెండు రోజుల్లో ఆగ్రో రైతు సేవా కేంద్రాలకు చేరుకుంటాయని అధికారులు చెబుతున్నారు. అన్న దాతలు ఎవరూ ఆందోళన చెందవద్దని వారు సూచిస్తున్నారు.