Telangana: "మక్తల్ టిక్కెట్‌కు ఫుల్ డిమాండ్- అధిష్టానంలో ఆశావహుల అలజడి"
Telangana: రసవత్తరంగా మక్తల్ రాజకీయం. పార్టీలన్నింటిలోనూ టిక్కెట్ ఫైట్
Telangana: రసవత్తరంగా మక్తల్ రాజకీయం. పార్టీలన్నింటిలోనూ టిక్కెట్ ఫైట్. రేసులో ఇద్దరికి పైగా అభ్యర్థులు. సీటు కోసం ఎవరికి వారే పావులు. అధిష్టానంకు తలనొప్పిగా ఆశావహులు. మక్తల్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఏపార్టీలో చూసినా టిక్కెట్ కోసం గట్టిపోటీ నడుస్తోంది. ఇక మఖ్తల్‌లో పేరున్న నాయకులు చిట్టెం కుటుంబం, ఎల్లారెడ్డి, కొత్తకోట దయాకర్ రెడ్డి తదితరులు ఇప్పటిదాకా ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇప్పటిదాకా ఆయా పార్టీల్లో వారికి టికెట్ ఇట్టే వస్తూ ఉండేది. వారు ఎన్నికల కోసం సిద్ధపడ్డారంటే చాలు.. టిక్కెట్ పెద్ద కష్టమేమీ కాదనే టాక్ ఉంది.
కానీ ఈసారి మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. ప్రతి పార్టీలోనూ ఇద్దరేసి నాయకులు పార్టీ టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. అధికార బీఆరెస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి ఇదే ప్రాంతానికి చెందిన జగన్నాథ్ రెడ్డి పోటీగా తయారయ్యారు. ఈయన హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ నెలకొల్పి.. ఐటీ సెక్టార్ లో ఉపాధికల్పన చేస్తున్నారు. చిట్టెం రామ్మోహన్‌రెడ్డి 2014లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించినా.. ఆ తర్వాత హస్తం పార్టీకి హ్యాండిచ్చి కారెక్కేశారు. 2018లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసి మఖ్తల్ చరిత్రలోనే అత్యధిక ఓట్లతో గెలిచారు. జనాలతో ఎలా మెలగాలో అందరి నాడిపట్టి రాజకీయాలు చేసే కుటుంబం నుంచి రావడం చిట్టెంకు అనుకూలంగా నిలుస్తోంది. కాస్తా కోపిష్టిగా కనిపిస్తున్నా.. ఎవరినీ ఇబ్బందిపెట్టే రకం కాదన్న పేరు చిట్టెంకు ఉంది. కానీ ఈ టర్మ్‌లో మఖ్తల్ మున్సిపల్ విషయాల్లో తలదూర్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కాస్తా మరకలంటించుకున్నారు.
అదే విధంగా జిల్లా కలెక్టర్‌గా ఉన్న దాసరి హరిచందన తన నియోజకవర్గంలో అడ్డుపుల్లలు వేస్తున్నారన్న విషయంలోనూ రెండుమూడు సార్లు పెద్దఎత్తున విమర్శలు చేసి ప్రధాన శీర్షికల్లో నిలిచారు. ఈ విషయాల్లో పార్టీ అధిష్టానం కూడా అసహనం వ్యక్తం చేసిందట. ఈ పరిణామాలన్నీ చిట్టెంకు ఇబ్బందికరంగా మారిందట.
ఈ నేపథ్యంలోనే వర్కటం జగన్నాథ్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందన్న ఆశాభావంతో ఉన్నారట. పార్టీ పరంగా ప్రధాన నాయకత్వం ఎవరూ వర్కటం వెంట లేకున్నా.. ప్రతి మండలం.. గ్రామంలో తనకంటూ ఓ క్యాడర్‌ని ఏర్పాటుచేసుకున్నారు. అనేక సామాజిక కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. ఎలాగూ ఐటీ రంగంలో ఉన్నందున.. తనకు మంత్రి కేటీఆర్‌తో సత్సంబంధాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ సాయంతోనే తాను టికెట్ సంపాదిస్తానన్న ధీమా వర్కటంలో కనిపిస్తుంది. చిట్టెం నోటి దురుసు తనకు లాభిస్తుందిని ఆయన అంచనా వేస్తున్నారు.
ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పన్నెండు శాతం ఓట్లనే సంపాధించిన బీజేపీ.. లోక్‌సభ ఎన్నికలు వచ్చేనాటికి అత్యధికంగా కనిపించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కొండయ్య 12.27 శాతం ఓట్లు అంటే 20వేల242 ఓట్లు రాబట్టారు. అదే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా నిల్చున్న జలంధర్ రెడ్డి 30వేల371 ఓట్లు సంపాధించి రెండో స్థానంలో నిలిచారు. కానీ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డీ.కె.అరుణ ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థికన్నా ఎక్కువ ఓట్లు సాధించి లీడ్ తీసుకుంది. ఇక ఆ ఎన్నికల్లో జలంధర్ రెడ్డి కూడా బీజేపీలో చేరడం డీకే అరుణకు అనుకూలించిన అంశం. అలా ఎంపీగా గెలిచిన మన్నె శ్రీనివాస్ రెడ్డికన్నా డీకే అరుణను మఖ్తల్ నియోజక వర్గం ప్రజలు ఎక్కువ ఆదరించారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల సంగతి పక్కనబెడితే.. అప్పటినుంచే బీజేపీలో కలవరం రేగుతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తానంటే తానన్న తగవు కొండయ్య, జలంధర్ రెడ్డిల మధ్య నెలకొంది. తాను బీజేపీలో సంస్థాగతంగా ఎదిగిన నేతను..అదీ కాకుండా బీసీ వర్గానికి చెందిన నాయకుడిని కావడంతో తనకే టికెట్ లభిస్తుందని కొండయ్య భావిస్తున్నారు. జిల్లాలో సంఖ్యాపరంగా బీసీలు ఎక్కువగా ఉండటం..ఒకటీ రెండు చోట్లల్లోనే బీసీ నేతలు ఉండటం మూలాన తనకే టికెట్ వస్తుందని కొండయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా నిల్చుని రెండోస్థానం సంపాదించడం జలంధర్ రెడ్డికి ప్లస్ పాయింట్‌గా ఉంది. అంతేకాకుండా గతంలో జరిగిన బండి సంజయ్ పాదయాత్రలో కూడా తన భూమిక కీలకమని జలంధర్ రెడ్డి చెప్పుకుంటున్నారు. కీలకనేత జితేందర్ రెడ్డి ఆశీర్వాదంతో తనకు టికెట్ దక్కడం ఖాయంగా భావిస్తున్నారు. ఇలా బీజేపీలో కూడా ఇద్దరూ టికెట్ రేసులో ఉండి ఆటను రక్తి కట్టిస్తున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే తంతు. రాహుల్ భారత్ జోడో యాత్ర నేపథ్యంలో రేవంత్ రెడ్డి మఖ్తల్ పర్యటనలో తీవ్రస్థాయిలో ఆందోళనలు కొనసాగాయి. మాజీ జడ్పీటీసీ సభ్యుడు, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న వాకిటి శ్రీహరి.. వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థిని అన్న రీతిలో కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. కాగా మాజీ ఆప్‌కాబ్ ఛైర్మన్ వీరారెడ్డి కుమారుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి కూడా తన క్యాడర్‌ను పెంచుకునే పనిలో ఉన్నారు. ప్రతి గ్రామంలో తిరుగుతు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను కూడా టిక్కెట్ రేసులో ఉన్నట్లు ఖచ్చితమైన మార్గాన పయనిస్తున్నారు.
ఇదిలా ఉండగానే కానీ.. మఖ్తల్ లో పెను మార్పులు రావచ్చన్న వార్తలు వాకిటి శ్రీహరికి, ఇటు ప్రశాంత్ వర్గీయులకు మింగుడు పడటంలేదు. రాబోయేకాలంలో తెలుగుదేశం సీనియర్ నేత దయాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి రెండుసార్లు మఖ్తల్ మీదుగా వెళ్లి కూడా కావాలనే వాకిటి శ్రీహరి ఇంటికి వస్తాననిచెప్పి రాలేదన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. దయాకర్‌రెడ్డికి రేవంత్ స్పష్టమైన హామీఇచ్చారని వారంటున్నారు. రేవంత్‌రెడ్డి రాహుల్ యాత్ర మార్గాన్ని పరిశీలించేందుకు వచ్చారు. నిజానికి కృష్ణా బ్రిడ్జ్ వరకు వెళ్లి తిరిగి మఖ్తల్ రావాలన్న ప్రణాళిక ఉండింది. కానీ రేవంత్ రాయిచూర్ మార్గాన కొడంగల్ వెళ్లడంతో శ్రీహరి వర్గీయులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దయాకర్ రెడ్డిని ప్రోత్సహించి..ఎప్పటినుంచో పార్టీలో ఉన్న తమను దూరం పెడుతున్నారన్న భావన శ్రీహరి వర్గీయుల్లో కనిపించింది. ఇలా అన్ని పార్టీల్లోనూ వచ్చే ఎన్నికల్లో టికెట్ రేసు మొదలైంది. మరి ప్రధాన పార్టీలు ఎవరికి టిక్కెట్ ఇస్తాయి.. ఎవర్ని బుజ్జగిస్తాయి..ఎవరి ఆగ్రహానికి గురవుతాయో చూడాలి.