RAINS: తెలంగాణలో వర్ష బీభత్సం

మెదక్ జిల్లాలో పిడుగుపాటుకు తాత, మనవడు మృతి... మరో అయిదు రోజులు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ;

Update: 2024-05-13 03:30 GMT

తెలంగాణలోని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి, ఆసిఫాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షాలు కురిశాయి. అనేక ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. చేతికొచ్చిన పంటలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం దెబ్బతిన్నాయి. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలి రహదారులపై పడటంతో ట్రఫిక్‌ అంతరాయం ఏర్పడింది. ఆదివారం కురిసిన వర్షాలు ప్రజలను అతలాకుతలం చేశాయి. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లిలో... ఐకేపీ సెంటర్లో ఆరబోసిన ధాన్యంపై టార్పాలిన్‌ కప్పడానికి వెళ్లిన తాతా మనవళ్లు శ్రీరాముల, శివరాజ్‌ పిడుగుపడి మృతి చెందారు.


ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మ గ్రామ శివారులో పిడుగు పడటంతో ...ఒకరు మృతి చెందగా... ఐదుగురు గాయాలపాలయ్యారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. భారాస జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బాధితులను పరామర్శించారు. పిడుగు పడి ముగ్గురు మృతి చెందడంపై..... సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పిడుగుపాటుతో గాయపడిన వారికి.. వైద్య సాయం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈదురు గాలులతో... భారీ వర్షం కురిసింది. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో ఏర్పాటు చేసిన టెంట్లు పూర్తిగా కింద పడిపోయాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భారీ ఈదురుగాలులకు ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలోని టెంట్లు కుప్పకూలాయి. కామారెడ్డిలో ఈదురుగాలులతో కూడిన వర్షంతో... ఎన్నికల సామగ్రి తరలింపులో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం రావడంతో.. టెంట్లు కుప్పకూలాయి. EVMలు తడవకుండా కాపాడేందుకు అధికారులు తీవ్ర అవస్థలు పడ్డారు. మహబూబాబాద్ జిల్లాలో ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతో.....విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్, మేళ్లచెరువు మండలాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల కారణంగా అక్కడక్కడా చెట్ల కొమ్మలు విరిగిపోవటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది..

తెలంగాణలో ఐదు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదారాబాద్ వాతావరణం కేంద్రం ప్రకటించింది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి సహా మరికొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుండగా..దక్షిణ, ఆగ్నేయ దిశలలో గాలులు వీస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది..

Tags:    

Similar News