Last Journey: అశేష జనవాహిని మధ్య ప్రజా గాయకుడు గద్దర్ అంతిమయాత్ర
అధికారిక లాంఛనాలతో గద్దర్ అత్యంక్రియలు నిర్వహిస్తోన్న ప్రభుత్వం;
ప్రజా యుద్ధనౌక గద్దర్ అంతిమ యాత్ర అశేష జనవాహిన మధ్య అల్వాల్ చేరుకుంది. భూదేవినగర్‌లోని స్వగృహంలో గద్దర్ భౌతిక కాయాన్ని కాసేపు ఉంచనున్నారు. కాసేపట్లో సీఎం కేసీఆర్ కాసేపట్లో గద్దర్ భౌతిక కాయానికి నివాళులర్పించనున్నారు. ప్రభుత్వం అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు నిర్వహిస్తోంది. గద్దర్ స్థాపించిన మహాభోది విద్యాలయలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. గద్దర్‌ను కడసారి చూసేందుకు అశేష జనం తరలివచ్చారు. అభిమానులు, జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అంతిమయాత్ర సాగిన దారంతా ఎరుపెక్కింది. కవులు, కళాకారులు తమ ఆట పాటలతో గద్దర్‌కు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు గద్దర్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
గద్దర్ మృతికి టీవీ5 యాజమాన్యం సంతాపం తెలిపింది. టీవీ5 చానల్‌లో ఏడేళ్లపాటు ప్రతి ఆదివారం నిర్విరామంగా గద్దర్ కార్యక్రమం కొనసాగింది. మీ పాటనై వస్తున్నా కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. పలు సామాజిక కోణాలపై టీవీ5లో గద్దర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, రైతులు, కార్మికులు, విభిన్న వర్గాల సమస్యలను ఫోకస్ చేస్తూ మీ పాటనై వస్తున్నా కార్యక్రమం కొనసాగింది. టీవీ5తో గద్దర్‌కు ఉన్న అనుబంధాన్ని యాజమాన్యం స్మరించుకుంది. గద్దర్‌తో ఏడేళ్లపాటు కలిసి పనిచేసిన టీవీ5 ఉద్యోగులు ఆయన హఠాన్మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గద్దర్ చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా.. అందర్నీ ఆప్యాయంగా పలికరించేవారని.. ప్రేమగా మాట్లాడేవారని నాటి తీపి గుర్తులను నెమరువేసుకుంటున్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో గద్దర్ పాటలు ప్రజలను కదిలించాయి. బలమైన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నప్పటికీ.. గద్దర్ తెలంగాణ ఏర్పాటుకు మద్దతు తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన నేతలకు గద్దర్ అండగా నిలిచారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ ద్వారా ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ రాసిన పాటలు యువతను కదిలించాయి. జై బోలో తెలంగాణ సినిమాలో కనిపించిన గద్దర్.. పొడుస్తున్న పొద్దు మీద పాటను రాయడంతో పాటు .. నటించారు. అమ్మ తెలంగాణమా అనే పాట కూడా ప్రజలను ఆకట్టుకుంది. గద్దర్ పాటలను ఆర్ నారాయణమూర్తి తన సినిమాల్లోకి తీసుకున్నారు. గద్దర్‌కు నంది అవార్డు వచ్చినా ఆయన తిరస్కరించారు. మా భూమి సినిమాలో వెండితెరపై కనిపించిన గద్దర్.. బండెనక బండికట్టి పాటకు ఆడి పాడారు. తెలంగాణలో ఎప్పటికీ ఆ పాట ఎవర్ గ్రీన్‌గా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు.