గద్దర్ ఆలోచనా విధానాన్ని ఇందిరమ్మ రాజ్యంలో అమలుచేస్తున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. నక్లెస్ రోడ్డులో గద్దర్ సతివనాన్ని నిర్మించి నిత్యం పరిశోధనలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరంన్నర స్థలాన్ని కేటాయిస్తున్నట్లు భట్టి విక్రమార్క ప్రకించారు. అలాగే గద్దర్ పై పరిశోధనలు, కార్యక్రమాలు నిర్వహించేందుకు రూ. 3కోట్లు ప్రభుత్వం కేటాయించనున్నట్లు చెప్పారు. నెక్లెస్ రోడ్ లో గద్దర్ స్మృతివనం ఏర్పాటుచేస్తామన్నారు.
ప్రజా ఉద్యమాలకు దిక్సూచి ప్రజాగాయకుడు గద్దర్ అనికొనియాడారు. గద్దర్ ప్రథమ వర్థంతి సభ మంగళవారం ఇక్కడ రవీంద్రభారతిలో జరిగింది. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దరన్న యాదిలో.... పేరిట జరిగిన ఈ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, పీడిత ప్రజల అభ్యున్నతి కోసం జీవితాంతం పరితపించిన గొప్ప వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. మలివిడత తెలంగాణ ఉద్యమానికి తన ఆట, పాటలతో ఊపిరిపోశారని చెప్పారు.
తాడిత, పీడిత వర్గాల విముక్తి కోసం, సమ న్యాయం, సమానత్వం కోసం తన పాటతో చైతన్యం రగిల్సిన గొప్ప వ్యక్తి గద్దర్ అన్నారు భట్టి. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గద్దర్ నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నామని, ఇంకా చెప్పాలంటే తమకు అండగా ఉన్నారని తెలిపారు. తాను చేపట్టిన పాదయాత్రలో ముందుండి నడిపించారని, ఆయన లేని లోటును భర్తీ చేయలేమని చెప్పారు. కానీ, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నడవడమే ఆయనకు ఘన నివాళిగా భట్టివిక్రమార్క చెప్పారు.