GANDHI: తెలంగాణ వైద్య రంగంలో మరో కీలక అడుగు
గాంధీ ఆస్పత్రిలో ఉచిత కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స
తెలంగాణ వైద్య రంగంలో మరో కీలక అడుగు వేస్తూ, గాంధీ ఆస్పత్రిలో ఉచిత కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మార్గదర్శకత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రావడం ఆరోగ్య రంగంలో కొత్త దశను ప్రారంభించినట్లుగా వైద్యులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా రూ.10 లక్షల వరకు ఖర్చయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను గాంధీ ఆసుపత్రిలో పూర్తిగా ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న చిన్నారులను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గుర్తించి, ఈ సేవలు అందిస్తున్నారు. ఇయర్-నోస్-థ్రోట్ (ENT) విభాగం ఆధ్వర్యంలో ఐదేళ్ల లోపు పిల్లలకు ఈ శస్త్రచికిత్సలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం ప్రారంభమైన తొలి రోజునే గాంధీ ఆసుపత్రి ఈఎన్టీ విభాగం వైద్యులు ఒక బాలుడికి విజయవంతంగా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స నిర్వహించారు. కాక్లియర్ ఇంప్లాంట్ సాయంతో పిల్లలు వినికిడి సామర్థ్యంతో పాటు మాట్లాడే నైపుణ్యాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. ప్రభుత్వ ఉచిత వైద్య సేవలు సామాన్య ప్రజలకు పలుకుబడి కలిగేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మేరకు ఈ వివరాలను సోమవారం ఎక్స్ వేదికగా వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనార్సింహ వెల్లడించారు.
అరుదైన శస్త్రచికిత్స
గాంధీ ఆస్పత్రిలో అత్యంత అరుదైన శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించి ఏడేళ్ల బాలుడికి పునర్జన్మ ప్రసాదించారు. మంచిర్యాల జిల్లా అకినేపల్లికి చెందిన అఖిల్ (7)కు మూడు నెలల వయసులోనే హెరిడిటరీ స్ఫెరోసైటోసిస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రొఫెసర్ నాగార్జున నేతృత్వంలో నిపుణులైన వైద్యులు అత్యంత క్లిష్టమైన ల్యాప్రొస్కోపిక్ స్ల్పినెక్టమీ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఇలాంటి వ్యాధుల్లో రక్తస్రావం అధికంగా ఉంటుందని, కొన్నిసార్లు ఓపెన్ సర్జరీ చేయాల్సి వస్తుందని ప్రొఫెసర్ నాగార్జున తెలిపారు. ల్యాప్రొస్కోపిక్ స్ల్పినెక్టమీ సర్జరీతో నొప్పి, ఇన్ఫెక్షన్లు, మచ్చలు తక్కువగా ఉంటాయని, రోగి త్వరగా కోలుకుంటారని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడం ఇదే మొదటిసారి అని ప్రొఫెసర్ వాణి తెలిపారు. గాంధీఆస్పత్రి చరిత్రలో ఇదో మైలురాయి అని పేర్కొన్నారు.