జీహెచ్‌ఎంసీ మేయర్‌ పీఠం ఖచ్చితంగా గెలుస్తాం : అమిత్‌షా

Update: 2020-11-29 09:50 GMT

హైదరాబాద్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. కేసీఆర్‌, ఎంఐఎం పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ప్రధాని మోదీపై హైదరాబాద్‌ ప్రజలు అభిమానం చూపుతున్నారని చెప్పారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ పీఠం ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు అమిత్‌షా. బీజేపీ జోరుతో కేసీఆర్‌, ఓవైసీ నారాజ్‌ అయిపోయారని ఎద్దేవా చేశారు. వరదల పాపం టీఆర్ఎస్‌ ప్రభుత్వానిదే అని విమర్శించిన అమిత్‌ షా.. చెరువుల ఆక్రమణ వల్లే వరదలు వచ్చాయని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వమించిన అమిత్‌షా.. హైదరాబాద్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.

దాదాపు రెండు గంటలపాటు ప్రచారం నిర్వహించిన షా.. ఎలాంటి ప్రసంగం చేయకుండానే రోడ్‌షో ముగించారు. బీజేపీ శ్రేణులపై పూలు చల్లుతూ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అమిత్‌షా రోడ్‌షోకు బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రోడ్‌షో జరిగే పరిసర ప్రాంతాలు మొత్తం కాషాయమయంగా మారిపోయాయి. భారత్‌ మాతాకీ జై.. జై శ్రీరాం అంటూ బీజేపీ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. గ్రేటర్‌ ఎన్నికల్లో అగ్రనేతలంతా ఒక్కొక్కరుగా తరలివచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. మేయర్‌ ఎన్నికల్లో సత్తా చాటుతామంటున్నారు తెలంగాణ బీజేపీ నేతలు.

అంతకు ముందు బేంగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న అమిత్‌షా.. అక్కడి నుంచి నేరుగా పాతబస్తీ భాగ్యలక్ష్మీ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దాదాపు 20 నిమిషాలపాటు అమిత్‌షా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భాగ్యలక్ష్మీ అమ్మవారికి ఆయనే స్వయంగా హారతి ఇచ్చారు. అమిత్‌షా రాకతో పాతబస్తీలోని చార్మినార్‌ ప్రాంతమంతా కాషాయమయం అయింది. షా పర్యటన నేపథ్యంలో చార్‌మినార్‌ ప్రాంతంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో సెక్యూరిటీ టైట్‌ చేశారు.

భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి వారాసిగూడ బయలుదేరి వెళ్లిన అమిత్‌షా.. అక్కడ రోడ్‌షోలో పాల్గొన్నారు. సీతాఫల్ మండి హనుమాన్ టెంపుల్ వరకు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. భారీగా తరలివచ్చిన జనంతో వారిసిగూడ రోడ్డు మొత్తం కిక్కిరిసిపోయింది. రోడ్‌షో అనంతరం బీజేపీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో అమిత్‌షా భేటీ అయ్యారు. గ్రేటర్ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. సాయంత్రం తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు అమిత్ షా.

Tags:    

Similar News