Gadwal Vijayalakshmi : కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న జీహెచ్ఎంసీ మేయర్
పార్టీ కండువాకప్పి ఆహ్వానించిన సీఎం;
తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో ఆమె హస్తం గూటికి చేరుకున్నారు. కాగా, కొద్దిరోజలుగా మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఆమె హస్తం గూటికి చేరారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి చేరుకున్న విజయలక్ష్మి.. సీఎం, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇక, అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా హస్తం తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా కారు దిగి హస్తం గూటికి చేరారు. దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, బీఆర్ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. త్వరలోనే వీరు పార్టీలో చేరనున్నట్లు సమాచారం. పార్టీ మార్పుపై కేశవరావు ఇప్పటికే స్పష్టతనిచ్చారు. తాను సొంత గూటికి చేరోకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసమే బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. తాను 50 ఏళ్లకు పైగా కాంగ్రెస్‌లో పని చేశానని తీర్థయాత్రకు వెళ్లినవారు ఏనాటికైనా సొంత గూటికి చేరుకున్నట్లే తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు.