Yadagirigutta: యాదగిరిగుట్టలో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ..
5 వేల మందితో గిరి ప్రదక్షిణ నిర్వహణ..;
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో ‘గిరి ప్రదక్షిణ’ వైభవంగా జరిగింది. స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా మంగళవారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఆలయ ఈవో భాస్కరరావు సమక్షంలో వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు.
ఇందుకు సంబంధించి విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రతి స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు. అనాదిగా వస్తున్న గిరిప్రదక్షిణను భక్తులు విశేష సంఖ్యల్లో చేసుకోవాలని ఉద్దేశంతో స్వామి వారి దేవాలయం గిరి ప్రదక్షిణ రోడ్డును భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. అయితే.. ఇప్పుడు చేసేవారు కాకుండా.. గిరిప్రదక్షిణలో ఎక్కువ సంఖ్యలో భక్తులు పాల్గొనే విధంగా ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సామూహిక గిరిప్రదక్షిణ కార్యక్రమంను నిర్వహించారు. కాగా.. వేల సంఖ్యలో భక్తులు గిరిప్రదక్షిణ చేశారు. కాగా.. 2016లో ఆలయ పునర్నిర్మాణానికి ముందు భక్తులు గిరి ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకునేవారు. ప్రస్తుతం యాదగిరిగుట్టపై రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా భక్తుల కోరిక మేరకు గిరి ప్రదక్షిణను పునఃప్రారంభించాలని నిర్ణయించారు.