Amazon Warehouse : అమెజాన్ గోదాంలో రూల్స్ విరుద్ధంగా ఉంచిన వస్తువులు సీజ్
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ గోదాంలలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బృందాలు గురువారం సోదాలు చేపట్టాయి. శంషాబాద్ లోని ఎయిర్పోర్ట్ సిటీలో ఉన్న అమెజాన్ గోదాంపై తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ఉంచిన 2,783 వస్తుసామాగ్రి సీజ్ చేశారు. ఈక్రమంలో బిఐఎస్ చట్టం, 2016 నిబంధనలను ఉల్లంఘించినందుకు అమెజాన్ సంస్థపై కేసులు నమోదు చేశారు. బీఐఎస్ జరిపిన సోదాల్లో 150 స్మార్ట్ వాచీలు, 15 ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు, 30 సీసీటీవీ కెమెరాలు, 16 డొమెస్టిక్ ఎలక్ట్రిక్ ఫుడ్ మిక్సర్లు, 10 డొమెస్టిక్ ప్రెజర్ కుక్కర్లు, 1937 స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిళ్లు, 326 వైర్ లెస్ ఇయరబడ్లు, 170 మొబైల్ ఛార్జర్లు, 90 ఎలక్ట్రిక్, నాన్-ఎలక్ట్రిక్ బొమ్మలు వెరసి 2783 ఉత్పత్తులు బీఐఎస్ సర్టిఫికేషన్ లేకుండా స్టోర్ చేసి అమ్మకానికి ఉంచినట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఉత్పత్తుల విలువ రూ. 50 లక్షలకు పైగా ఉంటు ందని అధికారులు అంచనా వేశారు. కాగా అమెజాన్ గోదాంలపై బీఐఎస్ డైరెక్టర్ పి వి శ్రీకాంత్ ఆదేశాల మేరకు జాయింట్ డైరెక్టర్ రాకేష్ తన్నీరు నేతృత్వంలో, ఎస్పీ వో అభిసాయి ఎట్టా డిప్యూటీ డైరెక్టర్ కవిన్, జేఎస్ఏ శివాజీలు తనిఖీలు చేపట్టారు.