సమ్మక్క సారలమ్మలను దర్శించుకొనేందుకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఈ నెల 23న మేడారానికి వెళ్లనునన్నారు. ఈ విషయాన్ని మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు ఆమె ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్‌లతో కలిసి మేడారంలో ఏర్పాట్లను పరిశీలించారు. మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్తు, పుణ్యస్నానాల ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో సర్వీసులు పెంచామని స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు నాలుగు రోజులు పాటు జాతర జరగనుంది. 2 నెలల ముందు నుంచే భక్తుల రాక మొదలవ్వగా.. జాతర సమీపిస్తుండడంతో తాకిడి రోజురోజుకి పెరిగిపోతోంది. ఆదివారం 10 లక్షల మందికిపైగా భక్తులు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ములుగు జిల్లాలోని మేడారం కిక్కిరిసింది. ఉదయం 5 గంటల నుంచే సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్దకు చేరుకుని బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మేడారం చేరుకునే దారులన్నీ వెహికల్స్ తో నిండిపోయాయి. మేడారం చేరుకున్న భక్తులు ముందుగా జంపన్న వాగు వద్ద పుణ్యస్నానాలు చేశారు. వాగు ఒడ్డు మీద ఉన్న కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, జంపన్న గద్దె వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నుంచి మేడారం వరకు మొత్తం 228 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఉ. 6.00, 6.30 గంటలకు జేబీఎస్ నుంచి, 7 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బస్సులు బయలుదేరుతాయి. పెద్దలకు రూ. 750 చిన్నారులకు రూ. 450 టిక్కెట్ ధర నిర్ణయించారు. మేడారం నుంచి తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.00, 2.30, 3.00 గంటలకు బయలుదేరతాయి.