సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి ఆషాడం బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందుకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉజ్జయిని మహకాళి దేవస్థానంలో ఆషాడ జాతర బోనాలు ఉత్సవాలపై జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.వెంకట్రావు, అడిషనల్ సీపీ విక్రం సింగ్ మాన్, ఆలయ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆషాడా ఆ బోనాల ఉత్సవాలకు శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పని చేస్తూ బోనాల జాతరను విజయవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఉజ్జయిని మహాకాళి దేవస్థానం సికింద్రాబాద్లో జూలై 13న అమ్మవారికి బోనాలు సమర్పణ, 14 న రంగం (భవిష్యవాణి) అమ్మ వారిని అంబారిపై ఊరేగింపు కార్యక్రమం ఉంటోందని, రెండు రోజులలో భక్తులు, ప్రజలు లక్షల్లో తరలి వస్తారని ఆ దిశగా ఏర్పాట్లు కట్టుదిట్టం గా ఉండాలని మంత్రి సంబంధిత శాఖ అధికారులు ఆదేశించారు. అదేవిధంగా రెవెన్యూ దేవాదాయ, పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు.