గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇవాళ్టి నుంచి నామినేషన్లు
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈసారి సత్తా చాటేదెవరు.. GHMC తరహాలోనే ఈ నగరపాలక సంస్థ ఎలక్షన్స్‌ను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తొలిరోజు నుంచే ఆ రాజకీయ వేడి కనిపిస్తోంది.;
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈసారి సత్తా చాటేదెవరు.. GHMC తరహాలోనే ఈ నగరపాలక సంస్థ ఎలక్షన్స్‌ను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తొలిరోజు నుంచే ఆ రాజకీయ వేడి కనిపిస్తోంది. GWMCలో గతంలో 58 వార్డులు ఉంటే తాజా పునర్విభజన తర్వాత ఈసారి వాటి సంఖ్య 66కి పెరిగింది.
ఇవాళ్టి నుంచి ఆదివారం వరకూ వరంగల్ లాల్‌బహదూర్ కాలేజీ, హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నామినేషన్లు స్వీకరిస్తారు. వరంగల్ పరిధిలో మొత్తం ఓటర్లు 6 లక్షల 52 వేల 952 మంది ఉన్నారు. గతంతో పోలిస్తే ఈసారి లక్ష మంది ఓటర్లు పెరిగారు. బ్యాలెట్ పద్ధతిలో మే 3 వ తేదీన పోలింగ్ జరగనుంది.
ఈనెల ఒకటో తేదీ నుంచే గ్రేటర్ వరంగల్ పరిధిలో ఎన్నికల వేడి రాజుకుంది. డివిజన్ల పునర్విభజనకు, ఓటర్ల జాబితాకు ఆమోదముద్ర పడడంతో ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావచ్చనే లెక్కలు మొదలయ్యాయి. దీనికి తగ్గట్టే ఆశావహులు కూడా తమ ప్రయత్నాలు చేసుకున్నారు. టికెట్ కన్ఫామ్ అని భావించిన కొందరు తాజా మాజీలు ఇప్పటికే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టేశారు. ఇక ఇవాళ్టి నుంచి నామినేషన్లు మొదలవడంతో తొలిరోజు ఎన్ని దాఖలవుతాయి అనేది చూడాలి.
ఇక.. టికెట్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారంతా.. ముఖ్యనేతల్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న TRS.. డివిజన్ల వారీగా ప్రచార బాధ్యతల్ని MLAలకు అప్పగిస్తుందని తెలుస్తోంది. అలాగే కొందరు MLAలు, మంత్రులు కూడా కీలక పాత్ర పోషించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అనుసరించిన వ్యూహం లాగే ఇక్కడ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు.
అటు, కాంగ్రెస్ నుంచి కూడా ప్రచారంలోకి ముఖ్యనేతలంతా దిగబోతున్నారు. ఇక కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా జెట్టి కుసుమ్ కుమార్ వ్యవహరించబోతున్నారు. సాగర్ ప్రచారం ముగియడంతో పార్టీ ముఖ్యనేతలంతా ఇప్పుడు వరంగల్‌పై దృష్టి పెట్టి ఇక్కడ ప్రచారానికి తరలిరానున్నారు.
BJP కూడా ఓరుగల్లులో కాషాయ జెండా ఎగరేయాలని పట్టుదలగా ఉంది. ఇవాళ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ వరంగల్‌కి వెళ్తున్నారు. ఇన్‌ఛార్జ్ జితేందర్ రెడ్డి సహా ముఖ్యనేతలు ఈ 2 వారాలు అక్కడే మకాం వేసి పరిస్థితి స్వయంగా పర్యవేక్షించనున్నారు. హైదరాబాద్‌లో గెలుపొందిన BJP కార్పొరేటర్లు ఇప్పుడు వరంగల్‌లో ప్రచారానికి వెళ్తారని తెలుస్తోంది.