Telangana BJP : తెలంగాణ బీజేపీలో గ్రూపు రాజకీయాలు..?

Update: 2025-12-17 12:42 GMT

తెలంగాణ బీజేపీని గ్రూపు రాజకీయాలు వెంటాడుతున్నాయి. గతంలో పోలిస్తే ఇప్పుడు పార్టీకి పెద్దగా విజయాలు రావట్లేదు. కేవలం ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లలోనే పార్టీ గ్రాఫ్‌ కనిపించింది. కానీ తాజా సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీ అత్యంత దారుణమైన ఫలితాలను మూటగట్టుకుంది. దీనికి కారణం నేతల మధ్య సఖ్యత లేకపోవడం, గ్రూపు రాజకీయాలే అని తెలుస్తోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్‌, ఈటల రాజేందర్ తమ మాట నెగ్గాలన్నట్టు ఎవరికి వారే గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. అధ్యక్షుడు రామ చందర్ రావు ఉన్నా సరే పార్టీపై తన పట్టు పోకుండా చూసుకుంటున్నారు కిషన్ రెడ్డి. అందుకే కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌ కలిసి తమ మద్దతుదారులకే జిల్లాల అధ్యక్ష పదవులు ఇప్పించుకున్నారు.

ఈ వ్యవహారంతో రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు కూడా ఏమీ చేయలేక సతమతం అవుతున్నాడంటూ కేడర్ చెబుతోంది. అటు బండి సంజయ్ కూడా పార్టీపై ఎప్పటికప్పుడు ఆధిపత్యాన్ని చెలాయిస్తూనే ఉన్నారు. తమ మాట నెగ్గాలంటే తమ మాటే నెగ్గాలి అన్నట్టు ఎవరికి వారే గ్రూపులు మెయింటేన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా గ్రూపుల వారీగా విడిపోయి ఈ నలుగురిలో ఎవరో ఒకరి వైపు ఉంటున్నారని తెలుస్తోంది. దీంతో పార్టీలో ఆధిపత్య రాజకీయాలు ఎక్కువ అయిపోయి పార్టీని ఎవరూ పట్టించుకోవట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. మల్కాజిగిరి జిల్లా అధ్యక్ష పదవితో పాటు కరీంనగర్ ఇన్ చార్జి పదవి చాలా కాలంగా ఖాళీగా ఉంది. వీటిని తమ మద్దతుదారులకు ఇప్పించుకోడానికి ఈటల, సంజయ్ ప్రయత్నిస్తుంటే.. కిషన్ రెడ్డి టీమ్ ఒప్పుకోవట్లేదనే వాదనలు ఉన్నాయి.

మొన్న ప్రధాని మోడీ కూడా ఇదే విషయం మీద ఎంపీలు, ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. గ్రూపు రాజకీయాలు పక్కన పెట్టేసి పార్టీ గ్రాఫ్‌ కోసం కష్టపడాలని సూచించారు. ప్రధాని దాకా ఈ విషయం వెళ్లింది అంటే వీరి గ్రూపు రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆలోచించాలంటున్నారు పార్టీ కేడర్. గ్రౌండ్ లెవల్లో కష్టపడుతున్న కార్యకర్తలతో నిత్యం కనెక్ట్ అయి ఉండాలని ప్రధాని సూచించారు. ఇదే విషయాన్ని ఇప్పుడు పార్టీలో తీవ్రంగా చర్చిస్తున్నారు.


Full View

Tags:    

Similar News