TG : సీఎం రేవంత్‌ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ

Update: 2024-07-12 09:55 GMT

రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల అభ్యున్నతికి ఆర్థిక మద్దతును అందించాలని సహృదయంతో కేసీఆర్ గారు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ను ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిషత్ పరిస్థితి అగమ్యగోచరం కావడం బాధాకరం. విద్య, స్వయం ఉపాధి, వేద విద్యకు ప్రోత్సాహం కోసం అమలు చేసిన వివిధ పథకాలు ఆగిపోవడం విచారకరం. అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా? లేనట్టా? అనే ఆందోళన బ్రాహ్మణ సామాజిక వర్గంలో నెలకొంది.

సీఎంగా కేసీఆర్ గారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కోసం ఏటా రూ.100కోట్లు క్రమం తప్పకుండా కేటాయించారు. ‘’వివేకానంద” పేరుతో విదేశీ విద్యా పథకం, ‘’శ్రీ రామానుజ’’ పేరుతో ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం, ‘’వేదహిత’’ పేరుతో వేద పాఠశాలలకు మరియు వేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, ప్రతి నెల వేద శాస్త్ర పండితులకు గౌరవ వేతనం, ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ఆర్థిక ప్రోత్సాహం, బ్రాహ్మణ యువతకు పోటీ పరీక్షల శిక్షణ వంటి పథకాలను అమలు చేసి ఎంతోమంది పేద బ్రాహ్మణ కుటుంబాల్లో వెలుగులు నింపారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం, విదేశీ విద్యా పథకం కింద 780 మంది పేద బ్రాహ్మణ విద్యార్థుల కోసం రూ.20లక్షల చొప్పున ఖర్చు చేసింది. 436 మంది విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ అందించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకంగా 5,074 మందిని గుర్తించి, రూ.150 కోట్ల ఆర్థిక భరోసా కల్పించింది. ఇవే కాకుండా, బ్రాహ్మణుల గౌరవాన్ని మరింత పెంచేలా దేశంలోనే తొలిసారిగా, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో రూ. 12 కోట్లతో పది ఎకరాల విస్తీర్ణంలో విప్రహిత బ్రాహ్మణ సదన్ నిర్మించి, బ్రాహ్మణ సంక్షేమం విషయంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపింది.

Tags:    

Similar News