రోజుకు 10లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ : మంత్రి ఈటెల
కరోనా వ్యాక్సిన్ పంపిణీపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి వ్యాక్సిన్ రాగానే ప్రజలందరికీ పంపిణీ చేస్తామని తెలిపారు.;
Etela Rajender (File Photo)
కరోనా వ్యాక్సిన్ పంపిణీపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి వ్యాక్సిన్ రాగానే ప్రజలందరికీ పంపిణీ చేస్తామని తెలిపారు. వ్యాక్సిన్ రవాణా, నిల్వ, పంపిణీ అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఇప్పటికే వ్యాక్సిన్ వేసేందుకు పదివేల మంది వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. ఒక్కొక్కరు రోజుకు వంద మందికి టీకా వేసినా పది లక్షల మందికి రోజుకి వ్యాక్సిన్ వేయగలమని పేర్కొన్నారు.
మొదటి దశలో వైద్యారోగ్య, పోలీసు శాఖ, మున్సిపల్, ఫైర్ సిబ్బందితో పాటు వయసు మీద పడిన వారికి టీకా ఇవ్వనున్నట్లు ఈటెల వెల్లడించారు. మొదటి డోసు వేసిన 28 రోజుల తర్వాత రెండో డోసు వేయాలని అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.
కరోనా లాంటి వైరస్ లను తట్టుకోవాలంటే ప్రజారోగ్య వ్యవస్థను పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈటెల అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం 11 సిటీ స్కాన్ సెంటర్లు, 3 ఎంఆర్ఐ యంత్రాలను వెంటనే కొనుగోలు చేసి వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంటికే పరిమితమై పండగలను జరుపుకోవాలని మంత్రి సూచించారు. ఈ ఏడాది డిసెంబర్ 9నుంచి ఇప్పటివరకు యూకే నుంచి రాష్ట్రానికి 1200 మంది వచ్చారని, వారిలో 846 మందిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వెల్లడించారు. వారిలో ఉన్న వైరస్ రకాన్ని గుర్తించేందుకు బాధితుల నమూనాలను సీసీఎంబీకి పంపించామన్నారు.