మంగళవారం తెల్లవారుజామున నుంచి నగరంలో భారీగా వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో హైదరాబాద్ తడిసిముద్దయ్యింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. సోమవారం ఉదయం వర్షం పడగా.. మధ్యాహ్నానికి కాస్త ఎండ రావడంతో అంతా కాస్త ఊరట చెందారు. మళ్లీ సాయంత్రానికి దట్టమైన మేఘాలు కమ్ముకులతో భారీ వాన పడింది. దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, ఎల్బీనగర్, నాగోల్, అల్కాపురి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్ పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్ బషీరాబాద్, జీడిమెట్లలో కుండపోత వర్షం పడింది. వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఖైరతాబాద్ ప్రధాన మార్గంలో మోకాలిలోతు వరకు నీరు చేరింది. రాష్ట్రంలో చాలా చోట్ల బుధ, గురు, శుక్ర వారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.