Munneru: మున్నేరుకు భారీగా పెరుగుతున్న వరద ..

మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు;

Update: 2024-09-08 03:45 GMT

రాష్ట్రంలో వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో మున్నేరు నదికి మరో వరద ముప్పు పొంచి ఉంది. మున్నేరు నది పొంగి పొర్లే అవకాశం ఉండడంతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హడావుడిగా ఖమ్మం బయలుదేరి వెళ్లారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఖమ్మం నగర కార్పోరేషన్ లోని దంసలాపురం న్యూ కాలనీలో మున్నేరు వరద ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రానికి ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్వయంగా తరలించారు.

ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రికి వరద పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు అన్నీ బ్లాక్ చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మున్నేటి వరద ప్రభావం జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లోని పరివాహక గ్రామాలకు ఉండనుండటంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.

ఖమ్మం జిల్లాలో మున్నేటి ముంపు ప్రాంతాల్లో శనివారం రాత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రజలకు సూచించారు. ఆదివారం (ఈరోజు) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మం 16వ డివిజన్ దంసాలపురం, తిరుమలాయపాలెం, రాకాసి తండా లో పర్యటించి పరిస్థితులను పరిశీలించనున్నారు. వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు. అలానే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.

Tags:    

Similar News