RAINS: హైదరాబాద్ లో దంచికొట్టిన వాన
నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం.. అత్యవసరమైతేనే బయటకు రావాలన్న అధికారులు;
హైదరాబాద్‌లో పలుచోట్ల సోమవారం రాత్రి భారీ వర్షం మొదలైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, కూకట్‌పల్లి, నిజాంపేట్, జేఎన్టీయూ, మూసాపేట్‌లో భారీ వర్షం కురిసింది. కోఠి, వనస్థలిపురం, ఎల్బీనగర్‌లో కుండపోత వాన పడింది. తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, దిల్‌సుఖ్‌నగర్, చంపాపేట్, సైదాబాద్, సరూర్‌నగర్, కోఠి, చాంద్రయణగుట్ట, మాదాపూర్ ప్రాంతాల్లోనూ వాన దంచికొట్టింది. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు‘
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తున్న వేళ జీహెచ్ఎంసీ కమిషనల్ ఆమ్రపాలి.. కీలక సూచనలు చేశారు. భాగ్యనగర ప్రజలు.. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందిగా ఉంటే జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించాలని కోరారు. భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. ఎమర్జెన్సీ బృందాలు అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు.
నేడు కూడా భారీ వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి. మీ. ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావం కారణంగా రాగల 24 గంటల్లో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.
ఏపీలోనూ...
ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేడు పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయశంకర్ బాబు, నారాయణస్వామి తెలిపారు. వర్షం కురిసే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలన్నారు. వేరుసెనగ, పత్తి, ఆముదం, మొక్కజొన్న పంటల్లో వర్షం నీరు నిల వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు తెలిపారు.