TG: తెలంగాణలో కుండపోత వర్షం

హైదరాబాద్‌లో భారీ వాన... పిడుగుపాటుకు ముగ్గురు మృతి;

Update: 2025-04-04 02:00 GMT

ఎండలు మండుతున్న వేళ తెలంగాణలో అకాల వర్షాలు దంచికొట్టాయి. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచడయంతో అనేక చోట్ల చెట్లు నేలకూలాయి. కుండపోత వర్షానికి రహదారులు జలమయ్యాయి. ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ స్తంభించడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పలు చోట్ల పిడుగులు కూడా పడుతున్నాయి. తెలంగాణలో పిడుగుపాటుకు ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు. ఏపీలోని కర్నూలు జిల్లా కందనదిలో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా కదిరిపల్లిలో మహిళ మరణించింది. ఒక్క వర్షానికే హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది.

హైదరాబాద్‌లో జడివాన

హైదరాబాద్ నగరంలో వర్షం దంచికొట్టింది. కుండపోత వర్షం.. మరోవైపు భారీ ఈదురు గాలులు నగర ప్రజలను భయపెట్టాయి. పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, లక్డీకపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, బేగంపేట, నాంపల్లి, మలక్‌పేట, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హస్తినాపురం తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. వర్షానికి తోడు వడగళ్లు కురవటంతో రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కి.మీ మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దాదాపు అరగంట పాటు ఆగకుండా కురిసిన వర్షంతో నగర ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. యాదాద్రి జిల్లా నారాయణపూర్‌లో అత్యధికంగా 9.7 సెం.మీల వర్షం కురింది. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో 8.8 సెం.మీ, సరూర్‌నగర్‌లో 8.7 సెం.మీ వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు. ఉరుములు, మెరుపులతో వాన దంచికొట్టింది. దీనితో నగరంలోని రోడ్లన్నీ నదుల్లా మారాయి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. పాతబస్తీలో గంటపాటు భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్‌లో మెర్క్యూరీ హోటల్ వద్ద ఓ కారుపై చెట్టు కూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు మహిళలు సురక్షితంగా భయటపడ్డారు.

ఊడిపడ్డ చార్మినార్‌ పెచ్చులు


హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. చార్మినార్‌ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వర్ష ప్రభావం కారణంగా చారిత్రక కట్టడం చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భాగ్యలక్ష్మి దేవాలయం వైపున ఉన్న మినార్‌లో పై కప్పు నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి. గతంలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఇదే మినార్‌ పైభాగం నుంచి పెచ్చులు ఊడిపడిన విషయాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు. చార్మినార్ కు నాలుగు మినార్‌లు ఉండగా, వాటిలో ఓ మినార్‌కు పగుళ్లు ఏర్పాడ్డాయి. గతంలో ఒక మినార్ పెచ్చులు ఊడి నేలపై పడిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు కట్టడాన్ని పరిశీలించారు. అనంతరం మరమ్మతు చర్యలు చేపట్టారు. భాగ్యలక్ష్మి దేవాలయం వైపున ఉన్న మినార్‌లో పై కప్పు నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. చార్మినార్ చూడటానికి వచ్చిన పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.

Tags:    

Similar News