Telangana Sayudhaporatam: తరాలు మారినా తరగని స్ఫూర్తి.. తెలంగాణ సాయుధ పోరాటం..

Telangana Sayudhaporatam: తరాలు మారినా తరగని స్ఫూర్తి. బాంచెన్ దొర కాళ్లు మొక్కుతా అంటూ మోకరిల్లిన తెలంగాణ ప్రజలు ఆంధ్ర మహాసభ అందించిన చైతన్యంతో తుపాకులు ఎక్కుపెట్టారు.;

Update: 2022-09-16 09:01 GMT

Telangana Sayudhaporatam: తరాలు మారినా తరగని స్ఫూర్తి. బాంచెన్ దొర కాళ్లు మొక్కుతా అంటూ మోకరిల్లిన తెలంగాణ ప్రజలు ఆంధ్ర మహాసభ అందించిన చైతన్యంతో తుపాకులు ఎక్కుపెట్టారు.భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ పంథా సాగించారు. దాదాపు 4వేల మంది రైతు దళాల యోధులు తెలంగాణ విమోచన కోసం ప్రాణాలు ఫణంగా పెట్టారు. చివరికి ఆ యోధుల ఆత్మబలిదానాలతో 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి సాధించుకుంది. బండెనక బడి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతావ్ కొడుకో నైజాం సర్కరోడా అంటూ నినదించి విముక్తి తెచ్చుకున్న రోజు సెప్టెంబర్ 17.

తెలంగాణ ప్రాంతం.. ప్రతిఘటనలకు అలవాలం. నిరంకుశవాదంపై అలుపెరుగని పోరాటం చేసిన అగ్నికణం. ఆరోజుల్లో అమాయకత్వం, మూఢనమ్మకాలు, అంటరానితనం, దుర్భర దారిద్ర్యంతో వెట్టి బతుకులే తమ నుదుటి రాతగా భావించి మగ్గిపోయారు తెలంగాణ ప్రజలు. దొరల గడీల్లో ఏళ్ల తరబడి జీతగాళ్లుగా, పాలేర్లుగా, దొరసానులకు రేయింబవళ్లు సేవలందించడమే దినచర్యగా ఉండేది.

పేదల భూములను, మహిళలను దొరలు చెరబట్టిన రోజులవి. నిజాం నవాబుల నిరంకుశ పాలన, పోలీసులు, సైన్యం, రజాకార్లు ప్రజల ధన, మాన ప్రాణాలతో చెలగాటమాడారు. అటువంటి నిజాం రక్కసి మూకలను అత్యంత సాహసోపేతంగా ప్రతిఘటించిన రైతాంగ పోరాటం... దొడ్డి కొమరయ్య అమరత్వంతో సాయుధ పంథాను అనుసరించింది.

తెలంగాణ పల్లెల్లో ఒకవైపు భూస్వాములు, రజాకార్ల అకృత్యాలపై సాయుధ దళాలు దాడులకు దిగుతుంటే.. మరోవైపు సింగరేణి బొగ్గు గనుల్లో నెలకొన్న దుర్భర పరిస్థితులపై కార్మిక వర్గం చైతన్యాన్ని రగిల్చింది. దేవూరి శేషగిరిరావు.. ఇల్లందు, కొత్తగూడెం కేంద్రాలుగా బొగ్గు గని కార్మికుల్లో పోరాట చైతన్యాన్ని నింపారు.

నిజాం కాలంలోనే కార్మికులను రహస్యంగా సంఘటితపరిచి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ స్థాపించారు. భూస్వాములు, పోలీసుల దాడులను తిప్పి కొట్టేందుకు శేషగిరిరావు సాయుధ దళానికి నాయకత్వం వహించారు. సాయుధ దళంతో భద్రాచలం ఏరియాలోని నెల్లిపాక అడవుల మీదుగా మణుగూరు వెలుతున్న క్రమంలో పోలీసుల ఎదురు కాల్పుల్లో శేషగిరి దళం కన్నుమూసింది.

తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ పల్లెలకే పరిమితం కాకుండా బొగ్గు గనుల్ల్లో దుర్భర పని పరిస్థితులపై, అణా బేడా వేతనాలపై పోరాటాలకు చైతన్యాన్ని నింపింది. ఆ మహత్తర సాయుధ పోరాటల కారణంగానే నేటికీ సింగరేణి కార్మికులు అనేక సంక్షేమ పథకాలను ఆస్వాదిస్తున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ ఆనాడు బలంగా ఉండేది. నైజాంకు వ్యతిరేక పోరాటం కంటే కమ్యూనిస్టు పోరాటంగా ఇక్కడ ఘనతికెక్కింది. ప్రధానంగా నిజాం ముఖ్య అనుచరుడుగా ఉన్న ఖాసీం రజ్వీ అనుచరుల దౌర్జాన్యాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఆనాడు ఖమ్మం జిల్లా వరంగల్‌లో భాగస్వామ్యంగా ఉండేది.

గార్ల, బయ్యారం, ఇల్లెందు ప్రాంతాల్లో నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. ఖాసీం రజ్వీ సైన్యాలు పలువురిని ఊచకోత కోశాయి. బయ్యారం, గార్ల తదితర ప్రాంతాల్లో సుమారు 50మంది వరకు రజ్వీ సైన్యం తుపాకులకు బలయ్యారు. ఖాసీం రజ్వీ గార్ల, బయ్యారం ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకుని నిరంకుశ పాలన సాగించాడు.

గార్ల రైల్వే స్టేషన్‌ను రజ్వీ సైన్యాలు తమ ప్రయాణ కేంద్రంగా మార్చుకున్నాయి. బండ్లకుంట దగ్గర జరిగిన కాల్పుల్లో రామినేని వెంకటేశ్వర రావు, శంకర, బుచ్చిమల్లు, కారం మల్లయ్య వీరోచిత పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించారు. వారి మృతదేహాలను గ్రామాల్లో ఊరేగించిన ఖాసీం రజ్వీ సేనలు భయోత్పాతం సృష్టించాయి. వీరి త్యాగాల ఫలితంగా అమరుల స్థూపాన్ని బయ్యారంలో ఏర్పాటు చేశారు.

తెలంగాణ సాయుధ ఉద్యమంలో కీలకంగా పని చేసిన ప్రాంతం మధిర నియోజకవర్గం. అప్పట్లో మధిర వరంగల్ జిల్లాలో భాగస్వామ్యంగా ఉంది. మధిర నియోజకవర్గంలోని ప్రతి ఊరు.. ఆనాటి నిజాంకు, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాండింది. ప్రధానంగా ఆంధ్ర ప్రాంతంలో బ్రిటీష్ ప్రభుత్వం ఉండడంతో అక్కడి పోరాట ప్రభావం ఇక్కడ పడింది. ‌

దీంతో కమ్యూనిస్టులు ఇక్కడ ఆంధ్ర మహాసభ పేరుతోపెద్ద ఎత్తున ఉద్యమాలను నడిపారు. సాయుధ పోరాటంలో ముందుండి కదం తొక్కిన ఊరిలో అల్లీనగరం ఒకటి. మధిర పక్కనే ఉండే ఈ అల్లీనగరంలో ఉద్యమాలు జరుగుతుంటే.. వాటిని అణచివేయడానికి ఖాసీం రజ్వీ సేనలు గ్రామంలోకి వచ్చాయి.

కమ్యూనిస్టు పార్టీ అందించిన చైతన్యంతో ఆ గ్రామస్తులు రజ్వీ సేనలు ఊళ్లో అడుగుపెట్టనివ్వకుండా తరిమికొట్టారు. ఆ తరువాత రజాకార్లు భారీ బలగాలతో వచ్చి అల్లినగరంలో విధ్వంసం సృష్టించారు. గ్రామంలో ఇద్దరిని కాల్చి చంపారు, ఇళ్లను తగులబెట్టారు. పాటిబండ్ల వీరయ్య, గుంటముక్కల నారాయణ, వాసిరెడ్డి సూర్యానారాయణ, గొట్టిగొండ జాలయ్య, వట్టికొండ నాగేశ్వరరావు, అనంతరామయ్య ఇళ్లకు నిప్పు పెట్టారు. దీంతో గ్రామస్తులంతా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని మాచినేనిపాలెం వెళ్లిపోయారు. నేటికీ ఆనాడు తగులపెట్టిన ఇళ్ల ఛాయలు కనిపిస్తుంటాయి.

తెలంగాణ సాయుధ పోరాటంలో మధిర ప్రాంతవాసులు ధైర్య సాహసాలతో రజాకార్లకు ఎదురొడ్డి పోరాడారు. కమ్యూనిస్టు పార్టీ నేతలు నల్లమల గిరిప్రసాద్, బొమ్మకంటి సత్యనారాయణ, మల్లు స్వరాజ్యం ఆధ్వర్యంలో క్యాంపులు నిర్వహించారు. గోవిందపురం గ్రామనికి సమీపంలో ఏడుగురిని కాల్చిచంపి, తరువాత వారిని గోవిందపురం తీసుకుని వచ్చి ఒకేచోట చితి పెట్టి కాల్చేశారు.

దానికి చిహ్నంగా గోవిందాపురం గ్రామంలో స్తూపాన్ని నిర్మించారు. నేటికీ అక్కడ వర్ధంతి వేడుకలు జరుగుతాయి. మధిర తాలూకా అల్లినగరం, గోవిందాపురం, మడుపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లోని ప్రజలు కమ్యూనిస్టు దళాల్లో చేరి ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. అల్లినగరానికి సమీపంలోని మోటమర్రిలో రజాకార్ల మిలిటరీ కేంద్రంపై గెరిల్లా దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

పుచ్చలపల్లి సుందరయ్య, నల్లమల గిరిప్రసాద్ వంటి నేతలు క్యాంపులు పెట్టి, గ్రామాలను సందర్శించి, ఉద్యమంలో మరింత ఉత్తేజం నింపారు. ఇప్పటికీ ఆనాటి సంఘటనలు కళ్లకు కట్టినట్టుగా ఉన్నాయంటూ, ఉద్యమ జ్ఞాపకాలను తలుచుకుంటూ, సాయుధ పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకుంటున్నారు.

Tags:    

Similar News